మూడు నెలల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడును మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. ఆరోగ్యం బాగా లేదన్న విషయం తెలిసిన వెంటనే చిరంజీవి స్వయంగా ఇంటికి వెళ్లారు. ఆయనకు ధైర్యం చెప్పడమే కాకుండా, స్వస్థత చేకూరేందుకు అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వెంటనే ఆయనకు మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ ఏఐజీ హాస్పిటల్‌లో ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రలోభాలకు లొంగకుండా నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా రాసే జర్నలిస్టుగా రామ్మోహన్ నాయుడికి ఎంతో పేరు ఉందని ఈ సందర్భంగా చిరంజీవి గుర్తుచేశారు. ఇలా నిబద్ధత కలిగిన పాత్రికేయులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఎంతో ఉందన్నారు.
రామ్మోహన్ నాయుడు త్వరితగతిన కోలుకోవాలని, యధాప్రకారం పనిచేయాలని ఆకాంక్షించారు. ఓ పక్క ఆచార్య షూటింగ్ బిజీ, మరోపక్క నిహారిక వివాహ వేడుకలతో, క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. ఓ జర్నలిస్టు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని తెలిసి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శమని ఆయన అభిమానులు కొనియాడారు. కాగా సమకాలీన సమాజానికి కావాల్సిన విలువైన రాజకీయం కోసం మెగాస్టార్ చిరంజీవితో ప్రజారాజ్యం పార్టీలో రామ్మోహన్ నాయుడు చురుగ్గా పనిచేశారు.