లాయర్ నుంచి మెగాస్టార్ వరకు.. 5 దశాబ్దాల నట విశ్వరూపం! అభినయ శిఖరానికి అరుదైన గౌరవం!

ఆయన కంఠంలో ఒక గాంభీర్యం ఉంటుంది.. ఆయన చూపులో ఒక తీక్షణత కనిపిస్తుంది. వెండితెరపై ఆయన కనిపిస్తే చాలు, అది ఒక సాధారణ మధ్యతరగతి తండ్రి పాత్ర అయినా లేక ఒక శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్ర అయినా సరే.. అందులో పరకాయ ప్రవేశం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

లాయర్ నుంచి మెగాస్టార్ వరకు.. 5 దశాబ్దాల నట విశ్వరూపం! అభినయ శిఖరానికి అరుదైన గౌరవం!
Padmabhushan Awardee Actor

Updated on: Jan 27, 2026 | 8:30 AM

లాయర్ కోటు వేసుకుని కోర్టులో వాదించాల్సిన వ్యక్తి, నటనపై ఉన్న మక్కువతో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి మలయాళ సినీ సామ్రాజ్యానికి అప్రతిహత ‘మెగాస్టార్’ గా ఎదిగారు. ఐదు దశాబ్దాలుగా భాషా భేదం లేకుండా దక్షిణాది సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ఆ నట దిగ్గజాన్ని ఇప్పుడు దేశం అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. 70 ఏళ్లు దాటినా నేటి తరం యువ నటులకు పోటీనిస్తూ ప్రయోగాత్మక కథలతో దూసుకుపోతున్న ఆ ‘మమ్ముక్క’ ప్రయాణంలో మనకు తెలియని అద్భుతమైన మలుపులు ఏంటి? ఆయన సాధించిన అరుదైన రికార్డులు ఏంటి?

లాయర్ నుంచి నటుడిగా..

మమ్ముట్టి అసలు పేరు ముహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పనపరంబిల్. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన, ఎర్నాకులం లా కాలేజీలో న్యాయ విద్య పూర్తి చేశారు. కొన్నేళ్ల పాటు లాయర్‌గా ప్రాక్టీస్ కూడా చేశారు. అయితే 1971లో ‘అనుభవంగళ్ పాలిచకల్’ సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ప్రారంభంలో ఎన్నో చిన్న పాత్రలు, నాటకాలు వేస్తూ నటనలో రాటుదేలారు. 1979లో హీరోగా అవకాశం వచ్చినా ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి 1980లో ‘మేళా’ వంటి సినిమాలతో హీరోగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు.

అవార్డుల పంట..

మమ్ముట్టి కేవలం మాస్ హీరోగానే కాకుండా, భావోద్వేగాలను పండించడంలో అగ్రగామిగా నిలిచారు. ‘మదిలుకల్’, ‘ఒరు వడక్కన్ వీరగాథ’ వంటి సినిమాలు ఆయన నటనా పటిమకు నిదర్శనంగా నిలిచాయి. ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్ పాత్రలో ఆయన చూపిన నటన అద్భుతం. ఆ పాత్రకు గాను ఆయన జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఇప్పటివరకు ఆయన మూడు సార్లు జాతీయ అవార్డులను ముద్దాడటం విశేషం. ‘యాత్ర’, ‘స్వాతి కిరణం’ వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన ఎంతో దగ్గరయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా వచ్చిన ‘యాత్ర’ లో ఆయన నటనకు తెలుగు వారు ఫిదా అయ్యారు.

Mammootty

మమ్ముట్టి సినీ కెరీర్‌లో కొన్ని రికార్డులు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. 1983 నుంచి 1986 మధ్య కేవలం నాలుగేళ్ల కాలంలోనే ఆయన సుమారు 120 సినిమాల్లో నటించి మెప్పించారు. అంటే సగటున నెలకు రెండు కంటే ఎక్కువ సినిమాలు విడుదలయ్యేవి. ఇంతటి వేగంతో మరే హీరో కూడా సినిమాలు చేయలేదని చెప్పాలి. అలాగే మలయాళంలో 15 సార్లు డబుల్ రోల్స్ చేసిన ఏకైక హీరోగా ఆయన రికార్డు సృష్టించారు. 450కి పైగా సినిమాల్లో నటించినప్పటికీ, నేటికీ కొత్త తరహా కథలను ఎంచుకోవడంలో ఆయన ముందుంటారు. ఇటీవల వచ్చిన ‘కాదల్ ది కోర్’ సినిమాలో ఆయన చేసిన సాహసోపేతమైన పాత్ర అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది.

70 ఏళ్ల వయసులోనూ..

వయస్సు పెరుగుతున్న కొద్దీ మమ్ముట్టి తన గ్లామర్ ను, ఫిట్నెస్ ను కాపాడుకుంటూ యువ హీరోలకు సవాల్ విసురుతున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు ఇంగ్లీష్ భాషల్లో నటించి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. సామాజిక సేవలో కూడా ఆయన ఎప్పుడూ ముందుంటారు. అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘మమ్ముక్క’ నేడు పద్మభూషణ్ అందుకోవడం ఆయన ఐదు దశాబ్దాల నిరంతర కృషికి దక్కిన గౌరవం. ఒక జూనియర్ ఆర్టిస్టుగా మొదలై, ఇవాళ భారతీయ సినిమా గర్వించదగ్గ నటుడిగా ఎదిగిన మమ్ముట్టి ప్రయాణం స్ఫూర్తిదాయకం. పద్మభూషణ్ పురస్కారం ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి.