Lata Mangeshkar: మళ్లీ క్షీణించిన లతా మంగేష్కర్‌ ఆరోగ్యం.. వెంటిలేటర్‌ పై చికిత్స అందిస్తోన్న వైద్యులు..

|

Feb 06, 2022 | 6:45 AM

ప్రముఖ లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్‌ (Lata Mangeshkar) ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ముంబయి (Mumbai)లోని బ్రీచ్‌ క్యాండీ హాస్పిటల్‌ వైద్యులు డాక్టర్‌ ప్రతిత్‌ సంధాని తెలిపారు.

Lata Mangeshkar: మళ్లీ క్షీణించిన లతా మంగేష్కర్‌ ఆరోగ్యం.. వెంటిలేటర్‌ పై చికిత్స అందిస్తోన్న వైద్యులు..
Lata Mangeshkar
Follow us on

ప్రముఖ లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్‌ (Lata Mangeshkar) ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ముంబయి (Mumbai)లోని బ్రీచ్‌ క్యాండీ హాస్పిటల్‌ వైద్యులు డాక్టర్‌ ప్రతిత్‌ సంధాని తెలిపారు. ప్రస్తుతం గాయని ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారని.. ఐసీయూలోని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్‌ తెలిపారు. కాగా కొవిడ్‌తో పాటు న్యుమోనియా బారిన పడిన 92 ఏళ్ల లతా మంగేష్కర్‌ జనవరి 11న ముంబయిలోని బ్రీచ్‌ క్యాండి ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. డాక్టర్ ప్రతిత్ సంధాని నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తోంది.

కాగా గత నెల చివరిలో లత ఆరోగ్యం మెరుగుపడుతోందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే ప్రకటించారు. ఆమె కరోనా, న్యుమోనియా నుంచి కోలుకున్నారని తెలియజేశారు. అయితే ఇంతలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించిందని వైద్యులు తెలియజేయడంతో సంగీతాభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. 1942లో 13 ఏళ్ల వయసులో లతా మంగేష్కర్ తన కెరీర్ ప్రారంభించారు. ఏడు దశాబ్దాల కెరీర్ లో 50వేలకుపైగా పాటలను పాడారు. లతా మంగేష్కర్ భారత అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కె, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ సహా ఎన్నో అవార్డులను అందుకున్నారు . ఇండియన్ నైటింగల్‏గా పేరు సంపాదించారు.  2019 నవంబర్ లో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆమెకు ఐరల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు లతా మంగేష్కర్ చెల్లెలు ఉష తెలిపింది.