
ప్రేమ కోసం కెరీర్‌ను వదులుకున్నాడని కొందరు అంటే, కాదు ఆయన ప్రవర్తనే కారణమని మరికొందరు అంటారు. ఆ వివాదంపై తాజాగా ఒక దర్శకుడు ఇచ్చిన వివరణ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన 1993లో ‘పరంపర’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. కానీ నిజానికి అంతకంటే ముందే ఒక భారీ ప్రాజెక్టుతో లాంచ్ అవ్వాల్సింది. అయితే ఆ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే ఆయనను తొలగించి మరో హీరోను తీసుకున్నారు. అప్పట్లో ఒక వింత ప్రచారం జరిగింది.. “నీ గర్ల్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెబితేనే సినిమాలో ఛాన్స్ ఇస్తాను” అని దర్శకుడు కండిషన్ పెట్టాడని, దానికి ఆయన ఒప్పుకోకపోవడంతో సినిమా చేజారిందని అందరూ అనుకున్నారు. ప్రేమ కోసం కెరీర్‌ను పణంగా పెట్టిన ప్రేమికుడిగా ఆయనకు గుర్తింపు వచ్చింది. కానీ మూడు దశాబ్దాల తర్వాత ఆ దర్శకుడు అసలు నిజాన్ని బయటపెట్టారు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. సైఫ్ అలీ ఖాన్.
సైఫ్ అలీ ఖాన్ మొదటి సినిమాగా రావాల్సిన ‘బేకుడి’ చిత్ర దర్శకుడు రాహుల్ రవాలి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. గర్ల్‌ఫ్రెండ్ కారణంగా సైఫ్‌ను రిజెక్ట్ చేశానన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. “అది పూర్తిగా అవాస్తవం. సైఫ్ అలీ ఖాన్ ఆ సమయంలో చాలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించేవాడు. అందుకే అతన్ని సినిమా నుండి తొలగించాల్సి వచ్చింది” అని రాహుల్ వివరించారు.
సైఫ్ అలీ ఖాన్ నటన పరంగా ఎంతో ప్రతిభావంతుడని, కానీ క్రమశిక్షణ విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉండేవాడని దర్శకుడు పేర్కొన్నారు. “షూటింగ్‌కు అసలు సమయానికి వచ్చేవాడు కాదు. సరిగ్గా రాకుండా నన్ను ఎంతో ఒత్తిడికి గురిచేసేవాడు. ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాకపోవడంతో చేసేదేమీ లేక అతన్ని పక్కన పెట్టాను. అయితే సంవత్సరాలు గడిచేకొద్దీ సైఫ్ తనలో తాను చాలా మార్పులు చేసుకున్నాడు. ఇప్పుడు ఎంతో క్రమశిక్షణ గల నటుడిగా ఎదిగాడు” అని రాహుల్ రవాలి ప్రశంసించారు.
తొలి ప్రయత్నంలో అడ్డంకులు ఎదురైనా, సైఫ్ అలీ ఖాన్ ‘ఆషిక్ ఆవారా’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘మై ఖిలాడీ తు అనారి’, ‘దిల్ చాహతా హై’, ‘హమ్ తుమ్’, ‘ఓంకార’ వంటి వైవిధ్యమైన సినిమాలతో బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా నిలిచారు. గతేడాది విడుదలైన ‘దేవర: పార్ట్ 1’ చిత్రంతో భైరా పాత్రలో విలన్‌గా మెరిసి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. ప్రస్తుతం ఆయన ‘హైవాన్’, ‘హమ్ హిందుస్తానీ’ వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అపజయాలు, వివాదాల నుండి పాఠాలు నేర్చుకుని అగ్రస్థానానికి చేరుకోవడం సైఫ్ అలీ ఖాన్ గొప్పతనం. ఆనాడు క్రమశిక్షణ లేదని విమర్శించిన దర్శకులే నేడు ఆయన ఎదుగుదలను చూసి గర్వపడుతున్నారు.