Awe Sequel: టాలీవుడ్‌లో వచ్చిన విభిన్న చిత్రాల్లో అ! కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నాచురల్ స్టార్ నాని నిర్మించారు. కాజల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, మురళీ శర్మ, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలు లభించడంతో పాటు బెస్ట్ మేకప్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో జాతీయ అవార్డులు కూడా లభించాయి. ఇదిలా ఉంటే ఈ మూవీకి సీక్వెల్ తీస్తానని ఎప్పుడో ప్రకటించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అయితే ఇంతవరకు ఆ సీక్వెల్‌కు సంబంధించిన ఒక్క అధికారిక ప్రకటన కూడా రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా అ!2పై సోషల్ మీడియాలో స్పందించారు ప్రశాంత్ వర్మ.
‘‘అ!2 గురించి నన్ను అడుగుతున్న వారందరికీ చాలా థ్యాంక్స్. ఈ ప్రాజెక్ట్‌పై మీరు చూపుతున్న ఆసక్తిని ధన్యవాదాలు. అ!2 సంబంధించిన స్క్రిప్ట్ పని ఏడాది క్రితమే పూర్తి అయ్యింది. అ! కంటే ఇది ఇంకా క్రేజీగా ఉంటుంది. కానీ దీన్ని నేను సెట్స్ మీదకు తీసుకెళ్లలేకపోతున్నా. ఎందుకంటే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మించే దర్శకుడు నాకు ఇంకా దొరకలేదు. నన్ను నమ్మండి. నేను చాలా అలిసిపోయా. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయినప్పుడే ప్రారంభమైనట్లు’’ అని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. ఇక దీనికి స్పందిస్తున్న నెటిజన్లు.. నానిని సంప్రదించలేదా..? అని కామెంట్లు పెట్టారు. ఈ క్రమంలో మరోసారి ఈ రూమర్లపై స్పష్టతను ఇచ్చారు ప్రశాంత్. ‘‘అ!2 కోసం నాని గారిని నేను సంప్రదించలేదు. వాల్ పోస్టర్ సినిమా ద్వారా ఆయన కొత్త టాలెంట్‌ను మాత్రమే పరిచయం చేస్తారు. ఇకపై అయినా ఇలాంటి రూమర్లు చెక్ పడుతుందని’’ భావిస్తున్నా అని ప్రశాంత్ కామెంట్ పెట్టారు.