Itlu Maredumilli Prajaneekam: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించే మారేడుమిల్లి ప్రజానీకం.. నరేష్‌ హిట్ కొట్టాడా.?

| Edited By: Narender Vaitla

Nov 25, 2022 | 6:46 PM

అల్లరి నరేష్ అంటే ఒకప్పుడు కేరాఫ్ కామెడీ సినిమాలు కానీ ఇప్పుడు కాదు. ఈయన మారిపోయాడు. ఎంతగా అంటే పూర్తిగా తన నుంచి వచ్చే సినిమాలు కామెడీ కాదు.. ఆలోచింపజేసేలా ఉండాలనిపించేంతగా..! గతేడాది నాందీతో అదే చేసి చూపించిన అల్లరి నరేష్.. తాజాగా..

Itlu Maredumilli Prajaneekam: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించే మారేడుమిల్లి ప్రజానీకం.. నరేష్‌ హిట్ కొట్టాడా.?
Itlu Maredumilli Prajaneekam
Follow us on

అల్లరి నరేష్ అంటే ఒకప్పుడు కేరాఫ్ కామెడీ సినిమాలు కానీ ఇప్పుడు కాదు. ఈయన మారిపోయాడు. ఎంతగా అంటే పూర్తిగా తన నుంచి వచ్చే సినిమాలు కామెడీ కాదు.. ఆలోచింపజేసేలా ఉండాలనిపించేంతగా..! గతేడాది నాందీతో అదే చేసి చూపించిన అల్లరి నరేష్.. తాజాగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో వచ్చాడు. మరి ఈ సినిమాతో అల్లరి నరేష్ అలరించాడా లేదా అనేది చూద్దాం..

సినిమా: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

నటీనటులు : అల్లరి నరేష్ ఆనంది, వెన్నెల కిషోర్, రఘుబాబు, శ్రీ తేజ్,సంపత్ రాజ్, ప్రవీణ్ తదితరులు..

ఇవి కూడా చదవండి

ఎడిటర్: చోటా కే ప్రసాద్

సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి

సంగీతం: శ్రీ చరణ్ పాకాల

నిర్మాత : S. లక్ష్మణ్ కుమార్, అన్నపూర్ణ స్టూడియోస్

దర్శకత్వం: A.R. మోహన్

విడుదల తేది : 25/11/2022

కథ:

శ్రీనివాస్ (అల్లరి నరేష్) ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తెలుగు టీచర్‌గా పని చేస్తుంటాడు. ఆయనకు ప్రభుత్వ విధుల్లో భాగంగా ఎలక్షన్ ఆఫీసర్‌గా విధులు అలాట్ చేస్తారు. అందులో భాగంగానే రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న మారుముల గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లిలో 100 శాతం ఓటింగ్ తీసుకురావాలని కలెక్టర్ ఆర్డర్ వేస్తాడు. అయితే ఆ ఊరుకు వెళ్లాలంటేనే కొన్ని కొండలు ఎక్కి దిగాలి. కనీస సౌకర్యాలకు దూరంగా.. ప్రపంచానికి, అభివృద్ధికి దూరంగా ఉన్న గూడెం జనం.. ఓటేయడానికి ఇష్టపడరు. తమ ఊరికి గుడి, హాస్పిటల్, బ్రిడ్జి వచ్చే వరకు ఓటేమయని చెప్తారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం మానేసిందని.. వాళ్లు కూడా ఆ ప్రభుత్వాన్ని పట్టించుకోరు. ఓట్లకు ఒప్పుకోరు.. అయితే శ్రీనివాస్ మంచితనంతో వాళ్లలో మార్పు తీసుకొస్తాడు. ఓట్లు వేయిస్తాడు.. అయితే ఆ తర్వాత ఏం జరిగింది..? వాళ్ల అభ్యర్థన ప్రభుత్వం పట్టించుకుందా..? అధికారులు ఏం చేసారు అనేది మిగిలిన కథ..

కథనం:

మార్పు ఓ సారి మొదలయ్యాక అది కంటిన్యూ అవ్వాలి. అల్లరి నరేష్ అదే చేస్తున్నాడిప్పుడు. నాందితో ‘లా’లో ఉన్న పాయింట్ చెప్పిన నరేష్.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంలో రాజకీయంలోని నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వం చూపించాడు. మరోసారి సీరియస్ కథతో ఆకట్టుకున్నాడు అల్లరి నరేష్. జనాన్ని కేవలం ఓట్లలా చూసే అధికారులు, రాజకీయ నాయకులలో మార్పు రావాలనేది ఈ చిత్ర కథ. దాన్ని చాలా వరకు ఎంగేజింగ్‌గా చెప్పే ప్రయత్నం చేసాడు కొత్త దర్శకుడు ఏఆర్ మోహన్. ఇంత సీరియస్ కథలోనూ అక్కడక్కడా వెన్నెల కిషోర్, రఘు బాబుతో ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చాడు. ప్రభుత్వం పట్టించుకోని జనానికి కోపం వస్తే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి.. ప్రపంచానికి దూరంగా బతికే గూడెం జనాల బతుకులెంత హీనంగా ఉంటాయో చూపించారు ఈ సినిమాలో.

కాకపోతే కథ అంతా ఒకే చోట జరుగుతుంది.. పాయింట్ అక్కడే తిరుగుతుంది. దీనివల్ల కాస్త స్లో అయిన ఫీలింగ్ వస్తుంది కానీ మ్యాటర్ అయితే ఆకట్టుకుంటుంది. మార్పు కోసం ఓటేస్తాం.. కానీ రాజకీయ నాయకులు మారుతున్నారు కానీ జనం బతుకులో మార్పు లేదు. ఎన్నికలప్పుడు ప్రజలే దేవుళ్లు అంటారు.. ఆ తర్వాత రాజకీయ నాయకులే దేవుళ్లైపోయి జనాన్ని క్యూలో నిలబెడతారు.. ఇలాంటి మంచి డైలాగులు సినిమాలో బాగానే ఉన్నాయి. ఎమోషనల్ డ్రామాగా సాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఆలోపించజేస్తాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో ఓ గూడెం అమ్మాయికి డెలవరి చేసే సీన్.. సెకండాఫ్‌లో రఘబాబు సీన్.. క్లైమాక్స్ బాగున్నాయి.

నటీనటులు:

అల్లరి నరేష్ చాలా బాగా నటించాడు.. నాందీ తర్వాత ఇది మరో మంచి ప్రయత్నం. కామెడీ నుంచి దూరంగా ఉంటూ.. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాడు నరేష్. హీరోయిన్ ఆనంది నటన బాగుంది.. గత సినిమాలతో పోలిస్తే ఇందులో మరింత మెచ్యూర్డ్‌గా కనిపించింది. వెన్నెల కిషోర్, శ్రీతేజ్ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఇంత సీరియస్ డ్రామాలోనూ అక్కడక్కడా కిషోర్ చమక్కులు బాగా పేలాయి. ప్రవీణ్ నటన బాగుంది.

టెక్నికల్ టీం:

సంగీతం పర్లేదు.. పాటలు బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మంచి ప్లస్. అడవులను అద్భుతంగా చూపించారు. ఎడిటింగ్ ఫస్టాప్ ఇంకాస్త ఫాస్టుగా ఉండాల్సింది. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాకు మరో అదనపు ఆకర్షణ దర్శకుడు ఏ.ఆర్. మోహన్ రాసుకున్న కథ. ఇందులో చాలా సందేశం ఉంది. పూర్తిగా మెసేజ్ ఓరియెంటెడ్ మాదిరి కాకుండా.. వీలున్నప్పుడల్లా ఎంటర్‌టైన్మెంట్ జొప్పించే ప్రయత్నం చేసాడు. జనం బతుకులు మారాలంటే.. ప్రభుత్వం మారాలి.. ప్రభుత్వ అధికారులు మారాలంటూ చెప్పాడు.

పంచ్ లైన్:

ఇట్లు మారుడుమిల్లి ప్రజానీకం.. మెసేజ్ ఓరియెంటెడ్ డ్రామా..