
ఆమె ఒకవైపు గ్లోబల్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూనే, మరోవైపు యాక్షన్ సినిమాల్లో అదరగొట్టడానికి సిద్ధమవుతోంది. పెళ్లయి, ఒక పాపకు తల్లి అయినప్పటికీ మునుపటి కంటే మరింత ఫిట్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఆమె హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్ పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. తన స్నేహితులతో కలిసి జిమ్‌లో ఆమె పడుతున్న కష్టం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ పక్కా ఫిట్‌నెస్ ప్లాన్ అనుసరిస్తున్న ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు.. అలియా భట్.
అలియా భట్ ఫిట్‌నెస్ కోచ్ కరణ్ సాహ్ని పర్యవేక్షణలో ఈ వర్కవుట్ సెషన్ సాగింది. ఇందులో అలియాతో పాటు ఆమె మేకప్ ఆర్టిస్ట్ పునీత్ బి సైనీ, హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. ఈ సెషన్‌ను ‘ఫుల్ బాడీ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ సర్క్యూట్’ అని పిలుస్తున్నారు. దీని పేరు వినగానే అలియా తనదైన శైలిలో స్పందిస్తూ.. “నువ్వు ఆ వర్కవుట్ పేరు చెప్పేలోపు వీడియో అయిపోతుంది” అంటూ తన స్నేహితులపై జోకులు వేస్తూ అందరినీ నవ్వించింది.
ఈ వర్కవుట్ వ్లాగ్ లో అలియా చాలా కఠినమైన వ్యాయామాలను ఎంతో సులభంగా చేయడం కనిపిస్తుంది.
అలియా భట్ తన టీమ్ తో కలిసి ఉన్న ఈ అన్‌ఫిల్టర్డ్ వీడియో చూసి అభిమానులు మురిసిపోతున్నారు. “అలియా తన సొంత మనుషుల దగ్గర ఒక చిన్నపిల్లలా ఉంటుంది.. ఇది చూడటానికి చాలా బాగుంది” అని కొందరు కామెంట్ చేస్తుంటే, “నువ్వే మాకు పెద్ద ఇన్‌స్పిరేషన్” అని మరికొందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం అలియా భట్ తన భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ‘లవ్ అండ్ వార్’ సినిమాలో నటించబోతోంది. అలాగే స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’ కోసం కూడా ఆమె సిద్ధమవుతోంది. వృత్తిపరమైన బాధ్యతలను, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూనే ఆరోగ్యంపై ఆమె చూపిస్తున్న శ్రద్ధ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.