టాలీవుడ్ నటుడు, సునీల్ అనారోగ్యంతో గత రాత్రి గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం నుంచి సునీల్ అనారోగ్యంపై రకరకాల వార్తలు ఒకేసారి గుప్పుమన్నాయి. అసలు సునీల్ అనారోగ్యానికి గల కారణాలు ఏంటో కూడా తెలియరాలేదు. అయితే తాజాగా తన అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చారు కమేడియన్ సునీల్. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు చెప్పారు. గత వారం రోజుల నుంచి తీవ్ర జ్వరం, సైనస్, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నానని.. దాంతో ఎక్కువగా యాంటీ బయోటిక్స్ వాడినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే వాటి కారణంగా గొంతులో, ఉపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో.. ఊపిరి పీల్చుకోవడం కష్టమైందన్నారు.
అందుకే రాత్రే కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినట్టు ఆయన చెప్పారు. సునీల్ ప్రకటనతో.. ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. ఇటీవల సునీల్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలో నటించారు. అలాగే రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజ సినిమాలో కూడా సునీల్ ప్రధాన పాత్ర పోషించారు.