
తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన విలక్షణమైన వాక్చాతుర్యం, మేనరిజమ్స్ తో నవ్వులు పూయించారు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల్లో తనదైన నటనతో నవ్వించిన కమెడియన్ ఆయన. కేవలం తెరపై నవ్వించడమే కాకుండా తెర వెనుక రచయితగా, దర్శకుడిగా, ప్రభుత్వ అధికారిగా ఆయన రాణించారు. ఒంగోలులో చదువుకునే రోజుల్లోనే తండ్రిని కోల్పోయారు. దీంతో ఇంటి బాధ్యతలు తన భుజాన వేసుకున్న ఆయనకు నాటకాలపై ఆసక్తి ఎక్కువే. దీంతో సినిమా అవకాశాల కోసం మద్రాస్ వెళ్లారు. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తిరిగి వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి హైదరాబాద్ లో విలేజ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ గా ఉద్యోగం సంపాదించుకున్నారు. అటు ఉద్యోగం చేస్తూనే దూరదర్శన్ లో ఆనందో బ్రహ్మా లాంటి సూపర్ హిట్ ప్రోగ్రామ్స్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వం వహించిన జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత నువ్వు నేను, మన్మథుడు, అతడు, రెడీ, ఒక్కడు వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తక్కువ సమయంలోనే తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. నువ్వు నేను సినిమాలో ఎంఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కాంబోలో వచ్చే కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. అయితే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సాయంత్రం ఆరు దాటితే షూటింగులకు ముగింపు పలికి కుటుంబంతో సమయం గడిపేవారు. అయితే వెండితెర తన నటనతో నవ్వులు పూయించిన ఆయన.. జీవితం మాత్రం ఎన్నో కష్టాలతో నిండిపోయింది.
ముఖ్యంగా ఆయను మృత్యువు వెంటాడిందనే చెప్పాలి. ఒకసారి ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు కింద కారు నలిగిపోయింది. ఈ ఘటనలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తర్వాత శ్వేతనాగు షూటింగ్ సమయంలో విషకీటకం కుట్టడంతో శ్వాస ఆడక ఇబ్బంది పడ్డారు. ఆ సమంయలో ఆయన భార్య సమయస్పూర్తితో ఆసుపత్రికి చేర్చడంతో ప్రాణాలతో బయటపడ్డారు. తర్వాత కామెర్లు కాస్త క్యాన్సర్ గా మారింది. చివరి రోజుల్లో ఆయన ఎంతో బక్కచిక్కిపోయారు. ఎప్పుడూ తనను ఆరోగ్యంగా, నవ్వుతూ చూసిన ప్రేక్షకులు తనను ఆ స్థితిలో చూడకూడదని చివరి రోజుల్లో ఎవరినీ కలవలేదు. చివరకు 2013 డిసెంబర్ 7న తుదిశ్వస విడిచారు.