West Bengal elections: Crude bombs, country-made firearms seized : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అసాంఘీక వ్యవహారాలు బయటకొస్తున్నాయి. భారీ స్థాయిలో అక్రమ ఆయుధాలు, నాటు బాంబులు, దేశీయంగా తయారు చేసిన తుపాకీలు పోలీసులకు చిక్కుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలో వేర్వేరు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో బాంబులు, నాటు తుపాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరేంద్రపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కతిపోటా గ్రామం సమీపంలో 48 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సదరు నాటు బాంబులను నిర్వీర్యం చేశామని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఇక, కుల్తాలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మెరిగుంజ్ గ్రామంలో శనివారం అర్థరాత్రి ఆయుధాలు తయారు చేసే ఒక కర్మాగారాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి అక్రమ ఆయుధాల తయారీ కేంద్రం స్థల యజమానిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని దగ్గర్నుంచి దేశీయంగా తయారు చేసిన నాలుగు తుపాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ప్రాంతంలో మూడో దశ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 6 న ఎన్నికలు జరుగనున్నాయి.
Read also : సీఎం పళనిస్వామిపై నీచమైన వ్యాఖ్యల ప్రతిఫలం, తమిళనాట ఆగ్రహజ్వాలలు.. మాజీ కేంద్ర టెలికాం మంత్రి ఎ రాజాపై కేసు