పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హాట్ హాట్ పంచ్ డైలాగ్స్‌తో హీటెక్కింది. భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పోటా పోటీ ప్రచారంతో దూసుకెళ్తున్నారు. 8 దశల్లో జరగుతున్న బెంగాల్ ఎన్నికల్లో.. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ పూర్తైంది. మూడో విడత ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్ర నాయకత్వం మోదీ, అమిత్ షా సుడిగాలి పర్యటనలు చేస్తూ సీఎం మమతా బెనర్జీనే టార్గెట్ చేస్తున్నారు. అంతే ధీటుగా సీఎం దీదీ జవాబు ఇస్తూ ఎదర్కొంటున్నారు. తాజాగా బీజేపీ ప్రభుత్వంపై మమతా సంచలన వ్యాఖ్యల చేశారు.
భారతీయ జనతా పార్టీ విభజన రాజకీయాలు చేస్తున్నారని మమత బెనర్జీ ఆరోపించారు. హిందూ, ముస్లింలను విభజించడానికి ఏఐఎంఐఎం, ఐఎస్ఎఫ్ పార్టీలను బీజేపీ వాడుకుంటోందని దుయ్యబట్టారు. దక్షిణ 24 పరగణాలలో రాయిడిఘి స్టేడియంలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి రాష్ట్రంలో బీజేపీ అంతర్గత మత కలహాలు రెచ్చగొడుతుందని మండిపడ్డారు. “ఓట్లను రాబట్టుకునేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీ దాని సహాయక పార్టీల ఉచ్చులో పడవద్దని ముస్లింలకు పిలుపునిచ్చారు. ఆమె అసదుద్దీన్ ఒవైసి నేతృత్వంలోని ఏఐఎంఐఎం, అబ్బాస్ సిద్దిఖీ ఆధ్వర్యంలోని ఐఎస్ఎఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఒవైసీ, సిద్దిఖీ ఇద్దరూ ఇంతకుముందు టీఎంసీతో పొత్తు పెట్టుకుని విబేధించారు. ప్రస్తుతం సిపిఐ (ఎం), కాంగ్రెస్‌లతో పొత్తు పెట్టుకుని ఐఎస్‌ఎఫ్ బెంగాల్ ఎన్నికల్లో పోరాడుతోంది.
హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు ‘హరే కృష్ణ హరే హరే, తృణమూల్ ఘరే ఘరే’ అంటున్నారని, కానీ బీజేపీవారు మాత్రం ‘హరే కృష్ణ హరే హరే, హిందూ, ముస్లిం భాగ్ కరే, షెడ్యూల్డు క్యాస్ట్స్ కో భాగ్ కరే’ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీనేతలు బెంగాల్‌ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. హిందువులు, ముస్లింలు కలిసి టీ తాగడం, కలిసిమెలిసి దుర్గా పూజ చేయడం మన సంస్కృతి అని దీదీ చెప్పుకొచ్చారు. పశ్చిమ బెంగాల్‌లోని గ్రామాల్లో అశాంతి నెలకొంటే, దాని వల్ల బీజేపీ లబ్ధి పొందుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం, ఐఎస్ఎఫ్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. హిందూ, ముస్లింలను విభజించడానికి ఈ రెండు పార్టీలకు బీజేపీ డబ్బులిచ్చిందని ఆరోపించారు. ‘‘మీరు వేరుపడాలని కోరుకోకపోతే, మీరు ఎన్ఆర్‌సీని కోరుకోకపోతే, ఆ పార్టీలకు ఓటు వేయకండి’’ అని మమత పిలుపునిచ్చారు.
ఆ పార్టీలకు ఓటు వేయడమంటే బీజేపీకి వేసినట్లేనన్న మమతా.. బెంగాల్ మతసామరస్యాన్ని కాపాడుకోవాలన్నారు. బాలికలు, పిల్లలు కిడ్నాప్ అవుతారని వాళ్ళు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బయటివారైన బీజేపీ గూండాలకు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు.
Also Read…. జాఫ్నాలో పర్యటించిన మొట్టమొదటి ప్రధాని మోదీ.. తమిళులకు అండగా ఉంటాం.. ఈరోడ్ ఎన్నికల సభలో నడ్డా