West Bengal Election 2021: పశ్చిమబెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే బీజేపీ-తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక్ష దాడులకు దిగాయి. దీంతోపాటు నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఇద్దరు పశ్చిమ బెంగాల్ మంత్రులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ సోమవారం లేఖ రాసింది. రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీం.. గత నెల 27న ఒక మసీదు వద్ద.. మైనారిటీ సామాజిక వర్గంతో జరిగిన సమావేశంలో మాట్లాడారని దానిలో ఆయన కోడ్‌ను ఉల్లంఘించారని పేర్కొంది. బీజేపీని ఓడించాలని పేర్కొంటూ.. మైనారిటీలకు తాయిలాలు ప్రకటించారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు సదరు మంత్రి ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను జత చేసినట్లు నాయకులు వెల్లడించారు. మంత్రి పక్కనే ఉన్న ఆ వర్గం పెద్ద .. హామీలను ఆమోదించాలని పేర్కొన్నారని పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. హౌరాలోని రామకృష్ణాపూర్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన డబ్బు పంపిణీ కార్యక్రమంలో మరో మంత్రి అరూప్ రాయ్ పాల్గొన్నారని ఇది కోడ్ ఉల్లంఘనే అని బీజేపీ పేర్కొంది. గతంలోనూ పశ్చిమ బెంగాల్ మంత్రులు కోడ్ ఉల్లంఘించారని, కానీ ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని భారతీయ జనతా పార్టీ వెల్లడించింది. వీరిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని.. బీజేపీ రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్గుప్తా, సీనియర్ నాయకులు ప్రతాప్ బెనర్జీ, షిషీర్ బజోరియా ఈసీకి లేఖ రాశారు. కాగా.. బీజేపీ నేతలు కూడా కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారంటూ టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఫిర్యాదుల మధ్య బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.
కాగా.. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకేదశలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. అసోంలో మూడుదశల్లో ఎన్నికలు జరగనుండగా.. పశ్చిమ బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
Also Read: