బెంగాల్‌ ప్రచారంలో మరోసారి రచ్చ.. బీజేపీ అభ్యర్థిపై దాడికి యత్నం.. నడిరోడ్డుపై తన్నుకున్న టీఎంసీ-బీజేపీ కార్యకర్తలు

|

Apr 14, 2021 | 8:54 PM

నార్త్‌ 24 పరగణ జిల్లా బారానగర్‌లో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణకు దిగారు. బీజేపీ అభ్యర్ధి పార్నో మిత్రా బైక్‌ ర్యాలీ సందర్భంగా గొడవలు చెలరేగాయి.

బెంగాల్‌ ప్రచారంలో మరోసారి రచ్చ.. బీజేపీ అభ్యర్థిపై దాడికి యత్నం.. నడిరోడ్డుపై తన్నుకున్న టీఎంసీ-బీజేపీ కార్యకర్తలు
Bjp's Parno Mittra Attacked
Follow us on

పశ్చిమ బెంగాల్ బెంగాల్‌లో బీజేపీ – తృణమూల్‌ కార్యకర్తల మధ్య మరోసారి ఘర్షణలు చెలరేగాయి. నార్త్‌ 24 పరగణ జిల్లా బారానగర్‌లో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణకు దిగారు. బీజేపీ అభ్యర్ధి పార్నో మిత్రా బైక్‌ ర్యాలీ సందర్భంగా గొడవలు చెలరేగాయి. చెప్పులతో , రాళ్లతో , కర్రలతో ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ గొడవ కారణంగా బీజేపీ అభ్యర్ధి పార్నో మిత్రా తన ప్రచారాన్ని మద్యలోనే నిలిపివేసి వెళ్లిపోయారు.

పశ్చిమ బెంగాల్‌లో 8 దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగుతోంది. ఇప్పటివరకు 4 దశలు పూర్తి కాగా, మరో నాలుగు దశలల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నార్త్‌ 24 పరగణ జిల్లా బారానగర్‌లో బీజేపీ అభ్యర్థి ప్రముఖ బెంగాల్ సినీ నటి పార్నో మిత్రా బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ బైక్‌ ర్యాలీపై తృణమూల్‌ కార్యకర్తలు అభ్యంతరం చెప్పడంతో బీజేపీ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. పోలీసులు ముందే ఇరు పార్టీ కార్యకర్తలు తన్నుకోవడం సంచలనం రేపింది. మహిళా కార్యకర్తలు కూడా పోటీ పడి తన్నులాడుకున్నారు.

టీఎంసీ కార్యకర్తలు తనపై దాడికి యత్నించారని, ఇది గమనించిన తమ కార్యకర్తలు అండగా నిలిచారని పార్నో మిత్రా తెలిపారు. బెంగాల్‌లో పూర్తిగా రాజకీయాలు చెడిపోయాయని ఆమె ఆరోపించారు. అధికారంలోకి రావడానికి టీఎంసీ అనేక అడ్డదారులకు ప్రయత్నిస్తున్నారన్నారు. తనకు ప్రాణ హాని ఉందని, తనకు ప్రత్యేక రక్షణ కావాలని ఫిర్యాదు చేసిన 24గంటల లోపే తన దాడి జరిగినట్లు ఆమె పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సందర్భంగా హింసను ప్రేరేపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదిలావుంటే, బెంగాల్‌లో ఎన్నికల వేళ పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరగడం కలవరం రేపుతోంది. ఓవైపు కరోనా విజృంభణ వేళ ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల సంఘానికి కత్తిమీద సాముగా మారింది. గురువారం అన్ని రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో హింస చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకోవడం, కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ప్రచారం నిర్వహించడంపై ఈసీ కీలక సూచనలు చేసే అవకాశముంది. ముఖ్యంగా ప్రచారంలో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి.

మరోవైపు ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ. జలేశ్వరి నియోజకవర్గంలో జరిగిన సభలో బీజేపీపై ఆమె నిప్పులు చెరిగారు. బెంగాల్‌లో ఆకస్మాత్తుగా కరోనా కేసులు పెరగడానికి బీజేపీ నేతల ప్రచారమే కారణమని మమతా బెనర్జీ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా బీజేపీ కార్యకర్తలను బెంగాల్‌కు తీసుకొస్తున్నారని, వాళ్లతోనే రాష్ట్రంలో కోవిడ్‌ విజృంభిస్తోందని మండిపడ్దారు. తాను కరోనాను కట్టడి చేస్తే బీజేపీ నేతలు పరిస్థితిని దిగజార్చారని అన్నారు. మరోవైపు బెంగాల్‌లో బీజేపీకి ఎంట్రీ ఇస్తే వినాశనమే అన్నారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌. తొలిసారి ఆయన బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డార్జిలింగ్‌ ర్యాలీలో పాల్గొన్నారు.

Read Also…  ఎన్నిక కమిషన్ తీరుపై తృణమూల్ కాంగ్రెస్ ఫైర్.. వ్యవహారశైలి దయనీయం అంటూ ఈసీ ఫ్యానెల్‌కు లేఖ