బెంగాల్ లో ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన అల్లర్లు, హింసతో భయపడి ఆ రాష్ట్రం నుంచి సుమారు 400 మంది బీజేపీ కార్యకర్తలు, వారి కుటుంబాలు తమ రాష్ట్రానికి తప్పించుకుని వచ్చారని అస్సాం మంత్రి హిమంతా బిస్వ శర్మ తెలిపారు. వీరంతా ఉభయ రాష్ట్రాల సరిహద్దులు దాటి ధుబ్రి జిల్లాలో ప్రవేశించారని, వీరికి షెల్టర్ కల్పించి ఆహారం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దీదీ !(మమతా బెనర్జీ) ఈ ప్రజాస్వామ్య హీనమైన డ్యాన్స్ కార్యక్రమాన్ని ఆపండి అని ఆయన ట్వీట్ చేశారు. లోగడ ఇలా ఎన్నడూ జరగలేదన్నారు. పశ్చిమ బెంగాల్ లో గత 2 రోజుల్లో జరిగిన హింసలో 12 మంది మరణించారు. వీరంతా తమ పార్టీ కార్యకర్తలని, తృణమూల్ కాంగ్రెస్ గూండాలే వారిపై దాడి చేసి హతమార్చారని బీజేపీ ఆరోపించింది. వారు ఇళ్లలోకి చొరబడి మహిళలపై కూడా దౌర్జన్యాలు చేశారని, పలు చోట్ల తమ పార్టీ కార్యాలయాలకు నిప్పు పెట్టారని బీజేపీ నేతలు ఆరోపించారు. అనేకమంది షాపులు లూటీలు చేశారని,, పోలీసులు ఇదంతా చోద్యంలా చూశారని అన్నారు. అయితే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ నేతలు.. ఈ హింసకు బీజేపీయే కారణమని ప్రత్యారోపణ చేశారు. ఈ హింసతో తమకు సంబంధం లేదన్నారు.
కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ తన ఓటమిని జీర్ణించుకోలేక పోతోందని, కానీ ఆ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయవద్దని తమ పార్టీ కేడర్ ను కోరానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఇప్పటివరకు తమ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని కేంద్ర దళాలే పర్యవేక్షిస్తున్నాయని, తాను కాదని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులను బీజేపీ కార్యకర్తలే భంగ పరుస్తున్నారని ఆమె ఆరోపించారు. అటు బెంగాల్ లో జరిగిన హింసపై ప్రధాని మోదీ..రాష్ట్ర గవర్నర్ జగ దీప్ ధన్ కర్ కి ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాలన్నారు.ఇలా ఉండగా అస్సాంలో ప్రవేశించిన బెంగాల్ బీజేపీ కార్యకర్తలు తమ రాష్ట్రంలో తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడగానే తాము వెళ్లిపోతామని వెల్లడించారు. తమను ఆదుకున్న అస్సాం ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని చదవండి ఇక్కడ : సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్న గున్న ఏనుగు..వావ్ అంటున్న నెటిజెన్లు..: Elephant Viral Video.
ఓటీటీలో దుమ్మురేపుతున్న పవన్ కళ్యాణ్ వీడియో వకీల్ సాబ్ … :Vakeel Saab creates record OTT video.