second phase campaigning end: పశ్చిమ బంగాల్, అసోం రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది. ఏప్రిల్ 1న బెంగాల్‌లో 30, అసోంలో 39 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది. కాగా, రెండో దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. మొదటి దశ్ పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని భద్రతను కట్టుదిట్టం చేసింది పోలీసు శాఖ.
రెండో దశలో భాగంగా అసోంలో 39 , బంగాల్లో 30 స్థానాలకు గురువారం ఓటింగ్ నిర్వహిస్తారు. బెంగాల్‌లోని దక్షిణ పరగణాలు, బంకురా, పూర్వ మెద్నీపూర్ జిల్లాల్లోని నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. బెంగాల్లోప్రభుత్వ ఏర్పాటుకు రెండో దశలోని నియోజకవర్గాలే కీలకం కానున్నాయి. సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి పోటీ చేస్తున్న నందిగ్రామ్‌పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పార్టీలు హోరాహోరీగా ప్రచారం సాగించాయి. ఈ స్థానానికి రెండో దశలో భాగంగా గురువారం పోలింగ్ జరగనుంది. ఈ దశలో 30 స్థానాలకుగానూ 171మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 152 మంది పురుషులు కాగా, 19 మంది మహిళలు. బెంగాల్‌లో 8 దశల్లో పోలింగ్జరుగుతుండగా, మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇక, అసోం రాష్ట్రంలో 39 అసెంబ్లీ స్థానాలకు రెండో దశలో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నిక సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 39 స్థానాలకు గానూ ఏకంగా 345 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 26 మంది మహిళలు కూడా ఉన్నారు. రెండో విడతలో మొత్తం 73,44,631 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పురుష ఓటర్లు 37,34,537మంది కాగా, మహిళా ఓటర్లు 36,09,959 మంది. 135 మంది ఇతరులున్నారు.
కాగా, రెండో దశ చివరి రోజు ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు రెండు రాష్ట్రాల్లో పోటా పోటీ ర్యాలీలు నిర్వహించారు. ముఖ్యంగా నందిగ్రామ్‌లో బీజేపీ అగ్రనేత అమిత్ షా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రోడ్ షో దేశవ్యాప్తంగా హాట్‌టాఫిక్‌గా మారింది. గురువారం జరగనున్న పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ జరగనుంది.