Uttar Pradesh Assembly Election 2022: ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ రాజకీయ యవనికపై బహు పసందైన నాటకం జరుగుతోంది. బలమైన కారణం ఉంటే తప్ప అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు రారు. పైగా మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య మంత్రి పదవికి రాజీనామా చేయడమే కాకుండా సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆయన కూతురు ఈ విషయాన్ని ఖండించినప్పటికీ మౌర్య బీజేపీని వీడింది మాత్రం నిజమే! మౌర్య వెంట మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా నడిచేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పేరుకుపోతున్నదని మౌర్య అనుకున్నారా? లేక పనితీరు సరిగ్గా లేని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇవ్వకూడదన్న బీజేపీ అధినాయకత్వం భావనను పసిగట్టి ఈ నిర్ణయం తీసుకున్నారా? ఏదైతేనేమీ మౌర్య పార్టీని వీడటం బీజేపీకి మాత్రం పెద్ద షాకే తగిలినట్టయ్యింది.
బీజేపీని ఎందుకు వీడాల్సి వస్తున్నదో వివరణ ఇచ్చుకున్నారు మౌర్య. కార్మిక మంత్రిగా తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాని చెబుతూ, సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ యోగి కేబినెట్‌లో అంకితభావంతో పని చేశారనని అన్నారు. కానీ దళితులు, వెనుకబడినవర్గాలు, రైతులు, నిరుద్యోగ యువత, చిన్న మధ్య తరగతి వ్యాపారులను యోగి ప్రభుత్వం అణచివేస్తూ, క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం చేస్తూ వస్తోందని, అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని మౌర్య చెప్పుకొచ్చారు. ఈ జ్ఞానోదయం ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఎందుకు కలిగిందన్నదే అనుమానం. యోగీ ప్రభుత్వం ఇన్నేసి దాష్టికాలు చేస్తుంటే ఎప్పుడో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సింది. పోనీ సమయం సందర్భం రాలేదనే అనుకుందాం! కనీసం సాగు చట్టాలపై రైతులు ఆందోళన చేస్తున్నప్పుడైనా చేయాల్సింది. లఖీంపుర్ ఖేరీలో కేంద్ర మంత్రి కొడుకు రైతులపై కారు ఎక్కించి చంపేసినప్పుడైనా మంత్రి పదవిని వదులుకోవాల్సింది.
ఇంత ఆకస్మాత్తుగా మౌర్య ఎందుకు పార్టీ మారాల్సివచ్చిందో తెలియదు కానీ, ఆయన రాజీనామా ప్రకటన రాగానే మరో ముగ్గరు ఎమ్మెల్యేలు రోషన్ లాల్ వర్మ, బ్రజేష్ ప్రజాపతి, భగవతి సాగర్ వినయ్ శాఖ్య కూడా బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు. తాము మౌర్య బాటలోనే నడుస్తామని ప్రకటించారు. మౌర్య ఏ పార్టీలో ఉంటే తాము కూడా అక్కడే ఉంటామన్నారు. వెనుకబడిన వర్గాల కోసం గొంతెత్తే మౌర్యనే తమ నాయకుడని చెప్పారు. యూపీ ఎన్నికల్లో ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి? సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎంతమందికి ఇవ్వాలి? ఇలాంటి విషయాలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా నేతృత్వంలో యోగీ ఆదిత్యానాథ్, ఇతర కీలక నేతలు ఢిల్లీలో సమావేశమైన సమయంలోనే ఇలా మౌర్య అండ్ కో పార్టీని వీడటం కమలం పార్టీ పెద్దలకు ఇబ్బంది కలిగించే విషయమే! స్వామి ప్రసాద్ మౌర్య పార్టీని వీడటం మాత్రం ఎదురుదెబ్బే! యూపీకి సంబంధించినంత వరకు మౌర్య అత్యంత శక్తివంతమైన నాయకుడు. వెనుకబడిన వర్గాల నేత. కుషావా వర్గాలలో ఆయనకు అపారమైన పట్టు ఉంది. బీజేపీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ వెనుకబడిన వర్గాల వారిని ఆకట్టుకోవడానికి, విపక్షపార్టీ అయిన సమాజ్‌వాదీకి ఎప్పటికప్పుడు చెక్ పెట్టడానికి చక్కటి వ్యూహరచన చేసేవారు. మంచి రాజకీయ వ్యూహకర్త అయిన మౌర్య ఇప్పటికే అయిదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నిజానికి మౌర్య 2016 వరకు మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అప్పుడు పార్టీలో టికెట్ల కుంభకోణం జరుగుతోందని కారణంగా బీఎస్పీ నుంచి బయటకు వచ్చేశారు. అటు పిమ్మట సొంతంగా లోక్‌తాంత్రిక్ బహుజన్ మంచ్ అనే సంస్థను స్థాపించారు.
2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతాపార్టీలో చేరారు. పడ్రౌనా నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. యోగి కేబినెట్‌లో కార్మిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మౌర్య పార్టీని వీడినందుకు బీజేపీ ఎందుకు వర్రీ అవుతున్నదంటే ఆయనకు కనీసం 20 నియోజకవర్గాలలో పట్టుంది. బీజేపీ విజయాన్ని అడ్డుకోగల సామర్థ్యం మౌర్యకు ఉంది. ఖుషీనగర్, ప్రతాప్‌గఢ్, కాన్సూర్ దెహర్, బండా, షాహజాన్‌పూర్ జిల్లాలో మౌర్యకు చెప్పుకోదగిన ఓటు బ్యాంకు ఉంది. మౌర్య అయితే బీజేపీని వీడిపోయారు కానీ ఆయన కూతరు సంఘమిత్ర మాత్రం కమలదళంలోనే ఉన్నారు. నాన్న ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరలేదని ఆమె చెబుతున్నారు. అంతేకానీ బీజేపీని వీడలేదని మాత్రం చెప్పలేదు. రాజీనామా చేసిన వెంటనే మౌర్య నేరుగా సమాజ్‌వాదీ పార్టీ ఆఫీసుకు వెళ్లి అఖిలేష్‌ను కలిశారు. అంటే ఎస్పీలో చేరడం ఖాయమైందన్నమాటేగా! పైగా తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంటున్నారు. ఇప్పుడు అందరికీ స్వామి ప్రసాద్ అంటే ఎవరో తెలిసి వస్తుందని పరోక్షంగా బీజేపీపై సెటైర్లు వేశారు. మరోవైపు బిదునా ఎమ్మెల్యే వినయ్ శాఖ్యను తమ కుటుంబసభ్యులే లక్నోకు బలవంతంగా పట్టుకెళ్లారని వినయ్ కూతురు రియా శాఖ్య ఆరోపిస్తున్నారు. తన తండ్రికి 2018లో బ్రెయిన్ సర్జరీ జరిగిందని, తర్వాత ఆయన ఆలోచనా శక్తి కూడా క్షీణించిందని ఆమె అంటున్నారు.
మొత్తంగా బీజేపీలోని పలువురు ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉన్న మాట నిజం. రాబోయే ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగితే మాత్రం అందుకు ఎమ్మెల్యేల వ్యవహారశైలినే కారణమవుతుంది. ప్రజలలో అసంతృప్తి పేరుకుపోయిన ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకూడదని అధినాయకత్వం భావిస్తే మాత్రం ఓ వంద మందికి టికెట్ దొరకకపోవచ్చు. ఇలాంటి వారంతా ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశం ఉంది.
Read Also…. Uttar Pradesh Elections: అత్యాచార బాధితులే అక్కడ అభ్యర్థులు.. ప్రియాంక కొత్త ఎత్తుగడ..