Manipur Assembly Election 2022: సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ఏ ఎన్నిక అయినా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా అలాగే అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. నిజానికి ఈ ఏడాది చివర్లో కూడా కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వచ్చే ఏడాది కూడా కీలకమైన రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అయినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం ఎంతో కొంత వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందనేది విశ్లేషకుల మాట! అయిదు రాష్ట్రాలలో పంజాబ్(Punjab), ఉత్తరాఖండ్(Uttarakhand), గోవా(Goa)లకు ఎన్నికలు ముగిశాయి. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)కు మరో నాలుగు విడతల పొలింగ్ ఉంది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ అసెంబ్లీకి రెండు విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 28, మార్చి 5వ తేదీల్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి.
వాస్తవానికి 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేంత సీట్లు ఏమీ రాలేదు. కాంగ్రెస్ కూటమికే ఎక్కువ స్థానాలు లభించాయి. మెజారిటీ రాకపోయినా ఎలాగోలా మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది బీజేపీ. మణిపూర్‌లో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. అప్పుడు బీజేపీకి 21 స్థానాలు వస్తే, కాంగ్రెస్‌కు 28 స్థానాలు లభించాయి కానీ మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయింది. నిజానికి సీట్ల పరంగా అతి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ పిలవాలి. కానీ అలా జరగలేదు. 21 సీట్లు మాత్రమే వచ్చిన బీజేపీ అనూహ్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ అధికారంలోకి రావడానికి నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ తదితరులు సాయం చేశారు. మణిపూర్‌లో బీజేపీ అధికారంలోకి రావడం అదే మొదలు. అక్కడ కమలం విరబూయడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. మొదట ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారు. 2017 ఎన్నికలకు కొద్ది రోజలు ముందు కాంగ్రెస్‌కు బై చెప్పి బీజేపీకి జై కొట్టారు. రాజకీయాలలో తనకు ఉన్న అపార అనుభవం, ఇతర పార్టీల నేతలతో ఉన్న సత్సంబంధాలను ఉపయోగించుకుని మద్దతు సంపాదించుకున్నారు. అలా సీఎం కాగలిగారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తారన్న సణుగుళ్లు అప్పుడు వినిపించాయి కానీ తర్వాతర్వాత ఆ గొంతులు కూడా రాజీ పడ్డాయి.
అధికారాన్ని నిలుపుకోవడం కోసం బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. మేనిఫెస్టోలో ఉచితాల వర్షాన్ని కురిపించింది. బోలెడన్ని వాగ్దానాలు చేసింది.. జనం తమవైపు నిలుస్తారో లేదోనన్న బెంగ బీజేపీకి అంతగా లేదు కానీ. పార్టీలో రోజురోజుకూ పెరుగుతోన్న అసంతృప్తి సెగలే దిగులు పుట్టిస్తున్నాయి. పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయి. టికెట్ దొరకనివారు తిరుగుబాటుకు దిగుతున్నారు. మణిపూర్‌లో విజయం సాధించిన వెంటనే బీజేపీ అధినాయకత్వం ముఖ్యమంత్రిని మారుస్తుందన్న ప్రచారమూ జరుగుతోంది. ఇంతకు ముందు అసోంలో బీజేపీ ఇదే చేసింది. సర్బానంద సోనోవాల్‌ను మార్చేసి హిమంత బిశ్వశర్మను ముఖ్మమంత్రిని చేసింది. మణిపూర్‌లో కూడా ఇదే జరగవచ్చని ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్యులు అంటున్నారు. బీరేన్‌సింగ్‌ను తీసేసి వేరేవారికి సీఎం పదవి ఇస్తారని పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇది ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మరి! ఎప్పుడైతే సీఎం మార్పులు ఉంటుందన్న వార్తలు వచ్చాయో అప్పుడే బీరేన్‌సింగ్ మద్దతుదారుల హడావుడి మొదలయ్యింది. బీజేపీకి వ్యతిరేకంగా వారంతా పని చేయసాగారు.
నిజంగానే బీజేపీకి ముఖ్యమంత్రిని మార్చాలని ఉంటే ఆ పదవి ఎవరికి ఇస్తారు? బీజేపీ అధిష్టానం మదిలో బిశ్వజిత్ ఉన్నారని కొందరు అంటున్నారు. బీరేన్‌కు, బిశ్వజిత్‌కు మధ్య అంత మంచి సంబంధాలేమీ లేవు. పైగా బీరేన్‌ను మార్చి బిశ్వజిత్‌ను సీఎం చేయాలంటూ రెండు మూడు సార్లు అధినాయకత్వానికి విజ్ఞప్తులు కూడా వెళ్లాయి. బిశ్వజిత్ నుంచి ఎప్పటికైనా తనకు ప్రమాదమేనని గ్రహించిన బీరేన్ అందుకు తగిన వ్యూహాలు పన్నారు. బిశ్వజిత్ అధికారాలను కుదించారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నుంచి తప్పించారు. ఇలా చేస్తే క్యాడర్‌కు రాంగ్ సిగ్నల్స్ వెళతాయని అనుకున్న బీజేపీ పెద్దలు ఇద్దరిని పిలిపించి నచ్చ చెప్పారు. బయపడటం లేదు కానీ ముఖ్యమంత్రి పదవి కోసం బిశ్వజిత్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సీనియర్ నేత గోవింద్‌దాస్ కొంతౌజమ్ కూడా ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలతో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు బీరేన్‌పై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి కీలక పదవి ఎలా ఇస్తారన్న మొదట ప్రశ్నించిందే ఆర్‌ఎస్‌ఎస్. ఈసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం గోవింద్‌దాస్‌నే సీఎంను చేయాలంటూ ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలు అంటున్నారు.
Read Also….