GOA ELECTIONS 2022: గోవాలో వెరైటీ రాజకీయం.. వ్యూహాత్మకంగా ఓటర్ల చెంతకు ఆమ్ ఆద్మీ పార్టీ.. బీజేపీకి చెక్ పెట్టేందుకు రెడీ..?
Goa Elections 2022: పిబ్రవరి 14న పోలింగ్ జరగనున్న గోవాలో అధికార బీజేపీ విపక్ష కాంగ్రెస్ పార్టీల కంటే.. ఢిల్లీ నుంచి దండయాత్ర కొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. అదేసమయంలో అత్యంత పకడ్బందీ వ్యూహంతో ముందుకెళుతోంది.

GOA ELECTIONS 2022 AAM ADMY PARTY VARIETY CAMPAIGN: అయిదు రాష్ట్రాల ఎన్నికల పర్వం క్రమంగా వేడెక్కుతోంది. తొలి విడత పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పిబ్రవరి 14న పోలింగ్ జరగనున్న గోవాలో అధికార బీజేపీ(Bjp), విపక్ష కాంగ్రెస్(Congress) పార్టీల కంటే.. ఢిల్లీ నుంచి దండయాత్ర కొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. అదేసమయంలో అత్యంత పకడ్బందీ వ్యూహంతో ముందుకెళుతోంది. గోవా రాజకీయాల్లో పార్టీ మార్పిడులు చాలా కీలకంగా కనిపిస్తూ వస్తున్నాయి. ఆ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థులు గెలిచినా, ఓడినా పార్టీని వీడబోరంటూ ఓటర్లకు హామీనిస్తూ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఇందులో భాగంగా ఆప్ అభ్యర్థులతో ప్రమాణ పత్రాలపై సంతకం చేయించి, వాటిని ఓటర్లకు పంచుతూ.. వారి విశ్వాసాన్ని సంపాదించేందుకు కేజ్రీవాల్ వ్యూహం రచించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 3న ఆప్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరి చేతా ప్రమాణ పత్రాలపై సంతకాలు చేయించి, వాటిని గోవా ప్రజల ముందుంచారు కేజ్రీవాల్.
రెండు దశాబ్దాల క్రితం రాష్ట్రం హోదా పొందిన గోవాలో పాశ్చాత్య సంస్కృతి కాస్త ఎక్కువేనని చెప్పాలి. అదే సమయంలో జాతీయతాభావం కూడా కనిపిస్తూ వుంటుంది. రెండు దశాబ్దాలుగా గోవాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య అధికారం చేతులు మారుతూ వస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలలో గెలుపొందినా కావాల్సిన మెజారిటీ అంకెకు కాస్త దూరంలోనే ఆగిపోయింది. అంతకు ముందు అధికారంలో వున్న బీజేపీ అయితే 40 సీట్లకు గాను.. కేవలం 13 సీట్లను గెలుచుకుంది. మిత్రపక్షాలతో కలిసి గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళకు మించి అధికారంలో కొనసాగలేదు. కమలనాథుల వ్యూహాలకు గోవాలో ప్రభుత్వ మార్పిడి జరిగిపోయింది. 2019లో గోవాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రస్తుతం అధికారపక్షం హోదాలో బీజేపీ గోవా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోంది. కాంగ్రెస్, మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీలు ప్రధాన పక్షాలుగా చాలా కాలంగా వున్నా.. ఈసారి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో బీజేపీకి గట్టిపోటీ ఎదురవుతోంది.
గోవాలో ఏ పార్టీ అభ్యర్థి అని కాకుండా.. స్థానికంగా తమకెంత ఉపయోగపడుతున్నాడు ఈ అభ్యర్థి..? గెలిస్తే ఇదేరకంగా వుంటాడా..? అనే కోణంలో ఆలోచించే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అందుకే గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు పార్టీ మారినా స్థానిక ఓటర్లు దాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోరు. దాన్ని ఆసరాగా తీసుకునే ఎమ్మెల్యేలు చాలా ఈజీగా పార్టీలు మారుతూ వుంటారు. 2019లో కాంగ్రెస్, గోమంతక్ పార్టీల తరపున గెలిచిన ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత బీజేపీవైపు మొగ్గుచూపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వారిపై అనర్హత వేటు పడకుండా బీజేపీ చాలా జాగ్రత్తలు తీసుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు గోవాలో దూకుడును ప్రదర్శిస్తున్నాయి. వారి దూకుడును గమనిస్తున్నా.. బీజేపీ నేతలు పెద్దగా టెన్షన్‌కు గురికావడం లేదు. దానికి కారణం ఎవరు ఏ పార్టీ తరపున గెలిచినా చివరికి తమ మంత్రాంగం ఫలిస్తే అధికారం తమ హస్తగతమేనని కమలనాథులు ధీమాగా వున్నారని గోవా మీడియా విశ్లేషిస్తోంది.
ఈక్రమంలో గోవాలో అధికారం తమదేనన్న ధీమాతో రంగప్రవేశం చేసిన తృణమూల్ కాంగ్రెస్ తొలుత చూపించిన దూకుడును కోల్పోయింది. దానికి కారణం ఆపార్టీకి పోటీ చేసే బలమైన అభ్యర్థులు దొరక్కపోవడమే కారణంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు బలమైన నేతలను లాక్కున్నా వారిలో ఒకరు పట్టుమని పదిహేను రోజులు తిరక్కుండానే తిరిగి సొంతగూడు కాంగ్రెస్ పార్టీకి తిరిగి వెళ్ళిపోయారు. మరోనేత సైతం టీఎంసీ వ్యూహాలను ఆకళింపు చేసుకోలేకపోతూ వున్నారా లేరా అన్నట్లుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం విలక్షణ ఆలోచనలు, విభిన్న పోకడలతో గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తోంది. గోవా బంగారు భవిష్యత్తు కోసం తమ పార్టీకి ఓటు వేయాలని అరవింద్ కేజ్రీవాల్ గోవా ప్రజలను కోరుతున్నారు. ఆయన పిలుపు కేవలం గోవా సాధారణ ప్రజలకే కాకుండా.. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల కార్యకర్తలకు కూడా వర్తించేలా తన పదబంధాలను, ప్రచారం స్క్రిపులను రూపొందిస్తున్నారు కేజ్రీవాల్. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల కార్యకర్తలు తమ పార్టీలో చేరేందుకు వారి వారి పార్టీలను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. మీ పిల్లలు, గోవా భవిష్యత్తు కోసం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు గుర్తుకు ఓటు వేయండి. దయచేసి ఈసారికి మీ పార్టీని మరచిపోండంటూ కేజ్రీవాల్ వెరైటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తే నిజాయితీగా పనిచేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులతో అఫిడవిట్‌లపై సంతకాలు చేయించారు అరవింద్ కేజ్రీవాల్. అంతేకాదు గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించబోమని, పార్టీతోపాటు ప్రజలకు విశ్వాసపాత్రంగా ఉంటామని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులంతా ఫిబ్రవరి 2న ప్రతిజ్ఞ చేశారు. ఫిబ్రవరి 2న జరిగిన ఈ ప్రతిఙ్ఞ కార్యక్రమంలో కేజ్రీవాల్ సమక్షంలో గోవా ముఖ్యమంత్రి అభ్యర్థి అమిత్ పాలేకర్ అభ్యర్థులందరితో ప్రమాణం చేయించారు. తమ పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులందరూ నిజాయితీపరులే. అయితే వీరంతా నిజాయితీపరులని ఓటర్లు నిర్ధారించేందుకు ఈ అఫిడవిట్‌లు అవసరమని కేజ్రీవాల్ అంటున్నారు. తమ అభ్యర్థులు వారి వారి నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికి వెళ్ళి తాము సంతకం చేసిన అఫిడవిట్ కాపీని పంపిణీ చేస్తారని కేజ్రీవాల్ ప్రకటించారు. ‘‘అలా చేయడం ద్వారా, మా అభ్యర్థులు అఫిడవిట్‌లోని నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై విశ్వాస ఉల్లంఘన దావా వేసే అధికారాన్ని మేము ఓటర్లకు అందిస్తున్నాం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేపథ్యాలను పరిశీలించేందుకు ప్రతి ఒక్కరికీ అనుమతి ఉంది. గోవా ప్రజల నమ్మకాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పటికీ వమ్ము చేయదు ’’ అని కేజ్రీవాల్ వెల్లడించారు. ఈతరహా కేజ్రీవాల్ వ్యూహం ఏ మేరకు ప్రభావం చూపుతోందో..? ఏ మేరకు విజయావకాశాలను మెరుగు పరుస్తుందో..? వేచి చూడాల్సి వుంది. కాగా.. గోవాలో ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాల్లో ఆప్ అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది.




