2021 Assembly Elections Date: దేశంలో ఈ రోజు మరో ఎన్నికల నగారా మోగనుంది. నాలుగు రాష్ట్రాలతోపాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ షెడ్యూల్‌ను శుక్రవారం సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలల మధ్య ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మీడియా సమావేశంలో.. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించనుంది.
ఇదిలాఉంటే.. త్వరలో ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల్లో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించింది. ఎన్నికల నిర్వహణపై అధికారులు, రాజకీయ పార్టీలతో ఈసీ చర్చించింది. ఎన్నికల సన్నద్ధత, శాంతి భద్రతలు, తదితర అంశాలపై ఈసీ అధికారులతో సమీక్షించింది.
కాగా… తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఉప ఎన్నికకు సైతం షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీ టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఈ స్థానం ఖాళీగా ఉంది. అలాగే ఏపీలోని తిరుపతి పార్లమెంట్ స్థానానికి సైతం షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందిన దుర్గా ప్రసాద్ కరోనాతో మృతి చెందారు.
Also Read: