Uttar Pradesh Assembly Election 2022: యూపీ ఎన్నికల ప్రచారంలో మంగళవారంనాడు ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీజేపీకి గుడ్‌బై చెప్పి సమాజ్‌వాదీలో చేరిన మాజీ మంత్రి స్వామిప్రసాద్ మౌర్య కారుపై కుషీనగర్‌లో రాళ్లదాడి జరిగింది. తన కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తలే రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఆరోపించారు స్వామి ప్రసాద్ మౌర్య. సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిగా కుషీనగర్ జిల్లాలోని ఫజిల్‌నగర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గానికి ఆరో విడతలో గురువారం(మార్చి 3న)నాడు ఓటింగ్ జరగనుంది. మంగళవారం సాయంత్రం ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల పనుల్లో ఉన్నప్పుడు తన కాన్వాయ్‌పై దాడి జరిగిందని తెలిపారు. తన డ్రైవర్ చెవికి గాయం ఏర్పడిందని, కాన్వాయ్‌లోని పలు వాహనాలకు డ్యామేజ్ అయ్యిందని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలపై కూడా దాడి జరిగిందని చెప్పారు. తాను తన వాహనంలో కాకుండా మరో వాహనంలో కూర్చొని ఉన్నందున దాడి నుంచి తప్పించుకున్నట్లు చెప్పుకొచ్చారు.
అటు బీజేపీ ఎంపీగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య కుమార్తె సంఘమిత్ర మౌర్య సైతం తన తండ్రి కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటనను ఖండించారు. ఈ దాడి వెనుక అధికారంలోని కొందరు ప్రముఖుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఫజిల్ నగర్ బీజేపీ అభ్యర్థి ప్రమేయంతోనే ఈ దాడి జరిగినట్లు ఆరోపించారు. ఘటనా స్థలికి వెళ్తుండగా తన కాన్వాయ్‌ని కూడా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నట్లు తెలిపారు. ఆమె గత మూడు నాలుగు రోజులుగా తన తండ్రి గెలుపు కోసం ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. మార్చి 3న జరిగే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తన తండ్రికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య కాన్వాయ్‌పై జరిగిన ఈ ఘటనను అఖిలేష్ ఖండించారు. మిగిలిన రెండు దఫా ఎన్నికల్లో బీజేపీని జీరో స్థానాలకు పరిమితం చేస్తామని వ్యాఖ్యానించారు.
యూపీ అసెంబ్లీకి ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటికే ఐదు విడతలు పూర్తయ్యాయి. ఆరో విడత పోలింగ్ మార్చి 3న, ఏడో విడత పోలింగ్ మార్చి 7న నిర్వహించనున్నారు. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆ రోజున యూపీతో పాటు ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా చేపట్టనున్నారు.
Also Read..
UP Election 2022: యూపీని చుట్టేసిన అగ్రనేతలు.. ప్రధాని మోడీ నుంచి మమతా వరకు అంతా అక్కడే..