భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఉన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. ఓ యువతిపై దాడికి తెగబడి పారిపోయేందుకు యత్నించి పోలీసులకు చిక్కాడు.. ఇల్లందు సత్యనారాయణపురంలో గురువారం అర్థరాత్రి 23 ఏండ్ల యువకుడు యువతిపై కత్తితో దాడిచేశాడు. అనంతరం సమీపంలో ఉన్న ముళ్ల పొదల్లో పడేసి వెళ్లిపోయాడు. ఇదే క్రమంలో అటుగా వచ్చిన పెట్రోలింగ్ పోలీసులకు యువకుడు తారసపడ్డాడు. అతని చేతులకు రక్తం మరకలు అంటి ఉండంతో అనుమానించిన పోలీసులు అసలు విషయం రాబట్టారు. యువతిపై దాడిచేసినట్లు అతడు తెలపడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముళ్లపొదల్లో అపస్మారక స్థితిలో ఉన్న యువతిని చికిత్స నిమిత్తం ఇల్లందు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతిపై దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.