భర్త ఇంట్లో అన్నం తినట్లేదని.. భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అందోలు మండలానికి చెందిన మంజుల, రమేష్ దంపతులు హైదరాబాద్‌లోని జూబ్లిహల్స్‌లోని రోడ్ నెంబర్ 13లో నివసిస్తున్నారు. గత కొంతకాలంగా వీరి మధ్య వివాదాలు నెలకొన్నాయి. దీంతో.. భర్త రమేష్ ఇంట్లో తినడం మానేసి.. బయట తినేసి వస్తున్నాడు. ఇలా చాలా రోజుల నుంచి విసిగిపోయిన మంజుల తీవ్ర మనస్తాపానికి గురైంది.
తాను వంట చేస్తే భర్త తినడం లేదని శుక్రవారం రాత్రి గొడవకి దిగి.. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి, బాధితురాలని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భార్య మంజుల పరిస్థితి విషమంగా ఉందని డాక్టరు పేర్కొన్నారు. కాగా.. స్థానికంగా ఈ ఘటన సంచలనమైంది. భార్య భర్తలన్నాక గొడవలు సహజమని.. ఈ మాత్రానికే ఆత్మహత్యలకు పాల్పడొద్దని పొలీసులు చెబుతున్నారు.