గతేడాది దేశ వ్యాప్తంగా ఉన్నవ్ రేప్ కేసు ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం బాధితురాలు ప్రమాదానికి గురికావడం కలకలం రేపుతోంది. బాధితురాలు ప్రయాణిస్తున్న కారును.. ఓ ట్రక్కు ఢీ కొంది. ఈ ఘటనలో బాధితురాలి బంధువులిద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.వీరిలో న్యాయవాది మహేంద్రసింగ్ కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్సపొందుతూ.. బాధితురాలి తల్లి, అత్త మరణించారు.
కాగా, బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సెంగర్ బాధితురాలిపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే, అతడి సోదరుడు జైల్లో ఉన్నారు. ప్రమాదానికి ఎమ్మెల్యేనే కారణమని బాధితురాలి బంధువులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు నంబర్ ప్లేట్‌పై నల్ల ఇంక్ ఉండటం.. పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో భారీ వర్షం కురుస్తోందని పోలీసులు పేర్కొన్నారు.