Tirupati ward Volunteer Suicide: చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి నుంచి కనిపించకుండాపోయిన ఓ వివాహిత రైలు పట్టాలపై విగతజీవిగా మారింది. తిరుపతి నుంచి నెల్లూరు మార్గంలో రైలు కింద పడి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీకాళహస్తి రూరల్ మండలం అక్కుర్తి గ్రామం వద్ద రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈఘటనకు సంబందించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తిరుపతిలోని కొర్లగుంట గ్రామానికి చెందిన చందన 9 వార్డు వాలంటీర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల కుటుంబంలో స్వల్ప గొడవ జరిగింది. ఇదే క్రమంలో శనివారం భార్య-భర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భర్తతో గొడవపడి 2 ఏళ్ల కొడుకును తీసుకుని రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి రైలు ఎక్కింది. తిరుపతి నుంచి నెల్లూరుకు వెళుతున్న ప్యాసింజర్ రైలులో ప్రయాణం చేస్తూ తన కుమారుడితో సహా రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండేళ్ల కొడుకుతో సహా రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.