విద్యాబుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకుడే తన విధిని మరిచాడు. విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దత్తత పేరుతో లొంగదీసుకునే ప్రయత్నాలు చేశాడు. అంతేకాదు అమ్మాయిలను మానసికంగా శారీరకంగా వేధించడం మొదలు పెట్టాడు. ఇంకేముందీ ప్రిన్సిపల్ ప్రవర్తనతో విద్యార్థులు విసిగిపోయారు. విద్యార్థిని విద్యార్థులు అంతా ఒకటయ్యారు. ప్రిన్సిపల్‌కు వీపు విమానం మోత మోగించారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం నారాయణాద్రి పాలిటెక్నిక్ కాలేజీలో జయప్రకాష్ నారాయణ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. గత కొద్దిరోజులుగా విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు విద్యార్థినిలను మానసికంగా శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. పేద విద్యార్ధిలను దత్తత తీసుకుని చదివిస్తానని, అమ్మాయిలను నమ్మించే ప్రయత్నం చేశాడు. వారిని లొంగదీసుకోవడం కోసం ద్వందార్ధాలతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రిన్సిపల్ కదాని ఇంతకాలం సర్ధుకు పోయారు. యవ్వారం శృతిమించడంతో సినిమా చూపించారు.
గత కొద్ది కాలంగా ప్రిన్సిపల్ వేధింపులను విద్యార్థులు మౌనంగా భరిస్తూనే ఉన్నారు. కీచక ప్రిన్సిపల్ వెకిలి చేష్టలు శృతిమించుకోవడంతో విద్యార్థులు విసిగిపోయారు. తాజాగా ఒక అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో స్టూడెంట్స్ అందరూ ఒకటిగా కలసి అధ్యాపకుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం కీచక ప్రిన్సిపాల్‌ను మన్నూరు పోలీసులకు అప్పచెప్పారు. గత కొద్దిరోజులుగా అధ్యాపకుడు తమని మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడని విద్యార్థులు గోడు వెళ్ళబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని మన్నూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విద్యార్థినిలతో అసభ్యంగా మాట్లాడిన ప్రిన్సిపల్ వాయిస్ రికార్డులను పోలీసులకు అందించారు.
తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన కాలేజ్ విద్యార్థిని, విద్యార్థులకు మన్నూరు పోలీసులు భరోసా ఇచ్చారు. ఇక మీదట అలా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో విద్యార్థులు శాంతించారు. ప్రిన్సిపల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…