
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి మృత్యువాత పడ్డ వారి సంఖ్య ఐదుకు పెరిగింది. 31 మంది నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. కల్తీ కల్లుకు పాల్పడిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని బాలానగర్ ఎక్సైజ్ పీఎస్‌లో విచారిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే బాలనగర్ ఎక్సైజ్ పీఎస్‌లో ఐదు, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ పీఎస్‌లలో మూడు కేసులు నమోదయ్యాయి. ఐదు కల్లు కాంపౌండ్‌ల నుంచి శాంపిల్స్ సేకరించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్‌కు పంపారు. ఇంద్రానగర్‌లోని కల్లు దుకాణంలో 66 గ్రాముల తెలుపు రంగు పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కల్లులో నెఫ్రో టాక్సిక్స్ కలపడం వల్లే చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు
కల్లు తాగే వారికి కిక్కుఇవ్వడం కోసం.. కస్టమర్లు మళ్లీ మళ్లీ వచ్చేందుకు.. అలాగే జేబు నింపుకునేందుకు కల్లు కాంపౌండ్ నిర్వాహకులు రసాయనాలను కలుపుతున్నారు. కల్లు తాగిన వారికి బాగా మత్తు రావడం కోసం కల్లు కాంపౌండ్ల నిర్వాహకులు క్లోరల్ హైడ్రేట్, అల్ర్పాజోలం, డైజోఫామ్ వంటి రసాయనాలను కలుపుతున్నారు. నురగ కోసం అమ్మోనియం లాంటి పదార్థాలు కలుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
అయితే రసాయనాలు కలిపిన కల్లు తాగిన వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నరాలు, మెదడు, కిడ్నీ, ఊపిరితిత్తులు, కాలేయం, గుండె వంటి కీలక అవయవాల పనితీరును అవి దెబ్బతీస్తాయని చెప్తున్నారు వైద్యులు. కడుపులో గ్యాస్ పెరిగి వాంతులు అవుతాయి. వాంతులు అయ్యే సమయంలో బాధితులు స్పృహకోల్పోతారు. కోమాలోకి వెళ్లిన వారికి వెంటనే చికిత్స అందించకపోతే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని చెబుతున్నారు వైద్యులు. ఒక్కసారి కోమాలోకి వెళితే వారిని సాధారణ స్థితికి తీసుకురావడం క్లిష్టంగా మారుతుందంటున్నారు.
ప్రమాదకరమైన రసాయనాలు కలిపిన కల్తీ కల్లు తాగితే ఫస్ట్ కంటి చూపుపై ప్రభావం చూపుతుందని… చూపు మసకగా మారుతుంది. మొదటి దశలో ఫిట్స్ రావడం, మానసిక స్థితి కోల్పోవడం, పిచ్చిగా వ్యవహరించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కడుపులో యాసిడ్ నిల్వలు పెరగడం వల్ల శ్వాస వేగం పెరిగి గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తాయి. – కల్తీ కల్లులో ఉన్న రసాయనాలు కిడ్నీలను దెబ్బతీస్తాయి. డయాలసిస్ చేయాల్సి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.