Student Death in Kompally : హైదరాబాద్ పరిధిలోని కొంపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చంద్రిక అనే విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. ఎంఎల్‌ఆర్ కాలేజీ హాస్టల్ పక్కనే మృతదేహాన్ని గుర్తించారు. ఒంటిపై గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యగా అనుమానం వ్యక్తంచేస్తున్నారు.మేడ్చల్ జిల్లాలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న చంద్రిక అనుమానాస్పదంగా మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది.
కాలేజీ దగ్గరలో ఉండే కృప హాస్టల్‌లో ఉంటుంది. అయితే రాత్రి ఏం జరిగిందో ఏమో గాని ఉదయానికి అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. ఇదిలా ఉంటే భవనం పైనుంచి దూకి చనిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. మృతదేహం పడి ఉన్న స్థలం నిర్మానుష్యంగా ఉంది. కూతవేటు దూరంలో భవనాలు ఉన్నాయి. అయితే భవనంపై నుంచి పడితే మృతదేహం ఇక్కడకు ఎలా వచ్చి పడిందనేది అంతుచిక్కకుండా ఉంది. కాగా చంద్రిక స్వస్తలం మిర్యాలగూడగా చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.