వీకెండ్ వస్తే చాలు.. నగరంలో మందుబాబుల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. మద్యం సేవించి వాహనాలు ఇష్టారీతిగా నడుపుతూ రెచ్చిపోతు.. ప్రమాదాలకు కారణమవుతున్నారు. పోలీసులు వరుస తనిఖీలు నిర్వహించి.. కౌన్సెలింగ్ చేసి కోర్టులో జరిమానాలు, శిక్షలు విధించినా వారిలో మార్పు కనిపించడం లేదు. వీకెండ్స్‌లో తనిఖీలు నిర్వహించిన ప్రతిసారి పదుల సంఖ్యలో తాగుబోతులు పట్టుబడుతున్నారు.
శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలుచోట్ల డ్రంకెన్ డ్రైవ్ చేపట్టారు. జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ , మాదాపూర్ , ఇతర ప్రాంతాల్లోనూ పోలీసులు ఈ తనిఖీలు చేపట్టి.. తాగుబోతులకు చెక్ పెట్టారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 81 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 31 కార్లు, 50 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
జూబ్లీహిల్స్‌లోని పార్క్ హయత్ దగ్గర నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో ఏకంగా 31 మంది మందుబాబులపై కేసు నమోదు చేశారు ట్రాఫిక్ పోలీసులు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారందరికీ మంగళవారం బేగంపేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి..అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.