
2017లో సంచలనం రేపిన గౌతిమి హత్యకేసును పోలీసులు నీరుగారుస్తున్నారంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఏడుగురు నిందితులపై అప్పట్లో రౌడీషీట్ ఓపెన్ చేశారు పోలీసులు. అయితే ఈ కేసులో చార్జషీట్ వేయకుండా నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని గౌతమి సోదరి పావని ఆరోపిస్తోంది. అయితే మాత్రం ఫోరెన్సిక్ రిపోర్ట్ రానందునే చార్జ్‌షీట్ వేయలేదని చెబుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన తంగేటి నరసింహారావు, అనంతలక్ష్మీ కుమార్తె శ్రీ గౌతమి.. ఆమె చెల్లెలు పావని స్కూటీపై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. స్కూటీని ఢీ కొన్న కారు రోడ్డు పక్కనే కాలువలోకి దూసుకెళ్లింది. తీవ్రగాయాలతో ఉన్న అక్కాచెల్లళ్లను స్థానికులు నర్సాపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పోందుతూ గౌతమి చనిపోయింది. పావని కొద్ది రోజులకు తేరుకుంది.
తన అక్కను పథకం ప్రకారమే హత్య చేశారని పావని అనుమానం వ్యక్తం చేసింది. అయితే పోలీసులు రోడ్డు ప్రమాదమే అంటూ అప్పట్లో కేసును క్లోజ్ చేసేందుకు చూశారు. కానీ.. పట్టువదలని పావని.. గౌతమి ఫోన్ ఆధారంగా వివరాలు సేకరించింది. తన అక్కను భర్త బుజ్జి పథకం ప్రకారమే చంపేశాడని సీఐడీ అధికారులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కిరాయి హంతకులతో గౌతమిని హత్య చేయించారని తేల్చారు.
ప్రమాదానికి కారణమైన కారు.. బుజ్జి నగదు బదిలీ చేసిన బ్యాంకు అకౌంట్లు విశాఖకు చెంది ఉండటంతో ఆ కోణంలో పోలీసులు విచారణ జరిపారు. ఏడుగురిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు.. కానీ రెండున్నరేళ్లు గడుస్తున్నా.. చార్జ్‌షీట్ వేయకుండా నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని గౌతమి సోదరి ఆరోపిస్తోంది. అయితే పోలీసుల వర్షెన్ మరోలా ఉంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ రానందు వల్లే చార్జ్‌షీట్ వేయలేదని చెబుతున్నారు.