తమిళనాడు పోలీసులు మరోసారి రెచ్చిపోయారు. కనికరం లేని ఖాకీ ఇంటి అద్దె కట్టలేదని చితకబాదారు. అవమాన భారం తట్టుకోలేక అమాయకుడు నిప్పటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో చోటుచేసుకుంది. చెన్నైకి చెందిన శ్రీనివాసన్ అనే వ్యక్తి స్థానికంగా పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, కరోనా లాక్‌డౌన్ కారణంగా అతను ఉపాధి కోల్పోయాడు. దీంతో కుటుంబం గడవడమే కష్టంగా మారింది. నాలుగు నెలలుగా ఇంటి అద్దె చెల్లించలేక ఇబ్బందిపడ్డాడు. ఈ విషయాన్ని ఇంటి యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఓ పోలీసు అధికారి అతన్ని పిలిపించి అద్దె కట్టాలంటూ హుకుం జారీ చేశాడు. తనకు పని లేక అద్దె చెల్లించలేకపోతున్నట్లు చెప్పాడు. దీంతో ఆగ్రహించి సదరు పోలీసు అధికారి శ్రీనివాసన్ ను చావబాదాడు. ఈ అవమానాన్ని భరించలేకపోయిన శ్రీనివాసన్ ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నాడు. 80శాతం కాలిన గాయాలైన అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను కన్నుమూశాడు. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు