Man dies as flying peacock hits: ఇటీవల కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రమాదం ఎలా ముంచుకొస్తుందో ఎవరూ కూడా అస్సలు ఊహించలేరు. దేశంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలతోనే వందలాది మంది మరణిస్తున్నారు. తాజాగా బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తికి నెమలి తగిలడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ విషాద సంఘటన కేరళలోని త్రిసూర్‌లో జరిగింది. మృతుడు ప్రమోష్ (34) గా పోలీసులు గుర్తించారు. ప్రమోష్ సోమవారం తన భార్యను త్రిసూర్ రైల్వే స్టేషన్‌కు తీసుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో అయ్యంతోల్ సమీపంలో పొలం నుంచి ఎగురుకుంటూ వచ్చిన నెమలి రోడ్డు దాటుతూ అతడిని ఢీకొట్టింది. దీంతో మోటార్ సైకిల్ నియంత్రణ కోల్పోయి రోడ్డుపై పడిపోయింది. దీంతో ప్రమోష్ అక్కడికక్కడే మరణించగా, అతని భార్య గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమోష్ తన భార్యను డ్రాప్ చేయడానికి త్రిసూర్ రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు వెంటనే కారులో ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే అతను మరణించాడని పోలీసులు తెలిపారు. అతని భార్యకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనలో నెమలి కూడా చనిపోయింది. కళేబరాన్ని అటవీ అధికారులు స్వాధీనం చేసుకుని ఖననం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. ఈ దంపతులు ఆరు నెలల క్రితమే వివాహం చేసుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. దీంతో ప్రమోష్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరికాసేపట్లో రేల్వేస్టేషన్‌కు చేరుకుంటాడనంగా.. మృత్యువు నెమలి రూపంలో దూసుకొచ్చిందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read: