తల స్నానం చేసారని విద్యార్థినులను చితకబాదిన టీచర్

| Edited By: Pardhasaradhi Peri

Mar 12, 2020 | 2:47 PM

అకారణంగా చిన్నారులపై విరుచుకుపడుతూ టీచర్లు, వార్డెన్ సిబ్బంది దాష్టీకం ప్రదర్శిస్తున్నారు. తాజాగా జనగామ జిల్లాలో తలస్నానం చేసారంటూ సుమారు 120 మంది విద్యార్థులను ఓ టీచర్..

తల స్నానం చేసారని విద్యార్థినులను చితకబాదిన టీచర్
Follow us on

హాస్టల్ విద్యార్థుల కష్టాలు అన్నీ ఇన్నీకావు..హాస్టల్స్‌లో ఉంటున్న పిల్లలకు సిబ్బంది, నిర్వాహకులు చుక్కలు చూపిస్తున్నారు. పురుగుల భోజనం, మరుగుదొడ్ల కొరత, అపరిశుభ్రవాతావరణంతో అవస్థలు పడుతున్న పిల్లలకు సిబ్బంది, నిర్వాహకులు పెడుతున్న ఇబ్బందులు మరో ఎత్తుగా చెప్పుకొచ్చు. అకారణంగా చిన్నారులపై విరుచుకుపడుతూ టీచర్లు, వార్డెన్ సిబ్బంది దాష్టీకం ప్రదర్శిస్తున్నారు. తాజాగా జనగామ జిల్లాలో తలస్నానం చేసారంటూ సుమారు 120 మంది విద్యార్థులను ఓ టీచర్ చితకబాదిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని రఘునాథపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో (కేజీబీవీ) అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. హోలీపండగను పురస్కరించుకుని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో విద్యార్థినులంతా రంగులు చల్లుకున్నారు. ఆ తరువాత ఆ రంగులను పొగొట్టుకోవడానికి విద్యార్ధులంతా తలస్నానం చేసారు. విద్యార్ధులందరూ అలా తల స్నానం చేయడం వలన సంపులో ఉన్న నీళ్లన్నీ అయిపోయాయి. కాగా అదే రోజు సాయంత్రం ప్రత్యేకాధికారిని సుమలత పాఠశాలకు వచ్చింది. సంపులో నీళ్లు లేకుండా, ఖాళీగా ఉండడం గమనించింది. అంతా తలస్నానాలు చేయడం వల్లే నీరంతా అయిపోయి ఉంటుందని తెలుసుకుంది. దీంతో ఆగ్రహించిన హాస్టల్ ప్రత్యేక అధికారిణి విద్యార్థులను పిలిచింది. ఎవరెవరైతే తల స్నానం చేసారో వారందరినీ వరుసగా నిలబెట్టి చేతి వేళ్లపై నిర్ధాక్షిన్యంగా కొట్టింది. నీటి కొరత ఉన్నప్పుడు తలస్నానాలు చేసి నీటిని వృథా చేస్తారా అంటూ.. వారిపై ఆగ్రహంతో విరుచుకుపడింది.

రంగులతో ఇన్ఫెక్షన్స్ వస్తాయని, అందుకే తల స్నానం చేసామని చెప్పినా ఆ అధిరానిని వినిపించుకోలేదు. విచక్షణ కొల్పోయి విద్యార్థులను చితకబాదింది. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు హాస్టల్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. సదరు అధికారినిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈ ఘటనపై అధికారిణి సుమలత స్పందిస్తూ పాఠశాలలో నీటి కొరత ఉందని, ఓ వైపు కరోనా వైరస్‌ ప్రభావం కూడా ఉన్నందున రంగులు చల్లుకోవద్దని విద్యార్థులను హెచ్చరించామని చెప్పారు. అయినా విద్యార్థులు తమ మాట పట్టించుకోలేదంటూ చెప్పుకొచ్చారు.