Hyderabad police: ఆన్‌లైన్ లోన్ యాప్స్ ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిర్వాహకులు.. జలగల్లా పట్టుకుని అమాయకుల రక్తం తాగేస్తున్నారు. బరితెగించి మరి వేధిస్తున్నారు. ఓ యువతికి అశ్లీల చిత్రాలు పంపించి వేధించిన లోన్ యాప్ (Loan App) సిబ్బంది ఒకరిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన యువతి లోన్ యాప్‌లో రుణం తీసుకుంది. అయితే.. కొన్ని వాయిదాలు చెల్లించిన ఆమె.. ఆర్థిక ఇబ్బందుల వల్ల చెల్లించలేకపోయింది. దీంతో యువతి ఫోన్‌కు అసభ్యకర మెస్సెజ్‌లు వచ్చాయి. అంతేకాకుండా ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలను సైతం లోన్ యాప్ నిర్వాహకులు ఆమెకు పంపించి బెదిరించారు. లోన్ యాప్ ఆగడాలను తట్టులేకపోయిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నిందితుడిని బీహార్ (Bihar) సివాన్ జిల్లా గోపాల్‌పూర్ కోఠిలో ఉన్నట్టు తెలుసుకున్నారు. అనంతరం మనీష్ కుమార్‌ను అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో వికాస్ కుమార్ అనే లోన్ యాప్ నిర్వాహకుడు పరారీలో ఉన్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. వాయిదాలు సకాలంలో చెల్లించని వారి ఆధార్, పాన్ కార్డు, ఫొటోలను వికాస్‌కు మనీష్ పంపిస్తున్నాడని.. ఆ తర్వాత మార్ఫింగ్ చేస్తున్టన్లు దర్యాప్తులో తేలిందన్నారు.
లోన్ తీసుకున్న వారు ఇచ్చిన వివరాలతో వారి బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నెంబర్లను ఎంపిక చేసుకొని వారి మొబైల్ ఫోన్లకు అశ్లీల చిత్రాలు పంపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..