
ఒడిశా రాష్ట్రంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. కంధమాల్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున కూబింగ్ చేపట్టిన భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పరస్పర కాల్పుల్లో ఓ మహిళతో సహా నలుగురు మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసులు చెప్పారు. కంధమాల్ జిల్లా సిర్లా అటవీప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో భారీ సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.
అయితే, మావోయిస్ట్ అగ్రనేతలతో సహా మరికొందరు మావోయిస్టులు ఘటనాస్థలం నుంచి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన మావోయిస్టులందరిపైనా గతంలో రివార్డులు ప్రకటించినట్లు పోలీసులు వెల్లడించారు. వీరు బీజీఎన్ డివిజన్‌కు చెందిన మావోయిస్టులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు పారిపోయిన వారి కోసం అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ను కొనసాగుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.