రాయదుర్గంలోని ఓ హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల ధాటికి హోటల్‌లోని జనం, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంతో హోటల్ పరిసరాల్లో పొగలు దట్టంగా అలముకున్నాయి. ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమని హోటల్ సిబ్బంది చెబుతున్నారు.
మొదట భవనంలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగి మూడో అంతస్తుకు వ్యాపించాయి. యాక్షన్ గార్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బందికి కేటాయించిన కార్యాలయంలో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కార్యాలయంలో 15 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. మంటల్లో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు క్రేన్ ద్వారా కిందకి దించారు. దట్టమైన పొగతో ఊపిరాడక ఇబ్బందిపడినవారికి ప్రాథమిక చికిత్స అందించారు. 4 అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పుతున్నారు. ఆ హోటల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.