Father And Son Die: పొలంలో కష్టపడుతున్న కుటుంబ సభ్యుల కోసం కోడికూర వండిపెడుదామనుకున్న తండ్రీ కొడుకులు అనుకోకుండా విద్యుదాఘాతానికి గురై బలయ్యారు. కుమురం భీం జిల్లా చింతలమానెపల్లి మండలం బాబాసాగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా అందరిని కలిచివేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబాసాగర్ గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె సంతానం.
ఇద్దరు కుమారుల్లో ఒకరు మూగవ్యక్తి. ఇతడికి పెళ్లి అయి రెండేళ్లు అవుతుంది. కూతురుకు కూడా వివాహం కాగా మరో కుమారుడు వేరే దగ్గర ఉంటాడు. అయితే తన భార్య, కోడలు పత్తి చేను నుంచి వచ్చి ఆలసిపోతారని, వారిని శ్రమ పెట్టడం ఎందుకని శంకర్ మూగవాడైన కొడుకు విజయ్‌తో కలిసి కోడికూర వండుదామని నిర్ణయించుకున్నారు. రేకుల ఇల్లు కావడంతో విజయ్ నూనె డబ్బాను తీసే క్రమంలో రేకులకు విద్యుత్తు సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. మూగవాడైన కొడుకు తండ్రికి ఏమి చెప్పలేకపోయాడు. కిందపడిపోయి ఉన్న విజయ్‌ని శంకర్ పట్టుకోవడంతో ఆయన కూడా విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.