ఆన్‌లైన్‌ గేమ్‌లో రూ.15 లక్షలు కొల్పోయి విద్యార్థి ఆత్మహత్య

|

Jul 12, 2020 | 12:25 PM

ఆటతో పాటు డబ్బులు సంపాదించాలన్న దురాశ ఓ నిండు ప్రాణం బలైంది. ఆన్‌లైన్‌ గేమ్‌కి బానిసైన ఆ యువకుడు రూ.15 లక్షలు నష్టపోయి చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయానన్న బాధ, తల్లిదండ్రులపై ఆర్థికభారం మోపానన్న ఆవేదనతో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆన్‌లైన్‌ గేమ్‌లో రూ.15 లక్షలు కొల్పోయి విద్యార్థి ఆత్మహత్య
Follow us on

ఆన్‌లైన్‌ గేమ్‌.. అరచేతిలో వైకుంఠపాళి. ఆన్‌లైన్‌ గేమ్‌కి యువత ఇట్టే ఆకర్షితులవుతున్నారు. తాము ఉన్న పరిసరాలను సైతం మరిచి ఏం చేస్తున్నామన్న విచక్షణ కొల్పోతున్నారు. పిల్లలు, పెద్దలు, యూత్ మొత్తం ఈ గేమ్స్ మత్తులో మునిగిపోతున్నారు. ఇంట్లో ఉన్నా అదే యావ…కాలేజీలో ఉన్నా అదే ధ్యాస..! పగలే కాదు..రాత్రంతా మేల్కొని మరీ ఆడుతున్నారు. ప్రస్తుతం ఇదో వ్యసనంలా మారిపోయింది. ఆటతో పాటు డబ్బులు సంపాదించాలన్న దురాశ ఓ నిండు ప్రాణం బలైంది. ఆన్‌లైన్‌ గేమ్‌కి బానిసైన ఆ యువకుడు రూ.15 లక్షలు నష్టపోయి చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయానన్న బాధ, తల్లిదండ్రులపై ఆర్థికభారం మోపానన్న ఆవేదనతో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెలకు చెందిన తోట మధూకర్‌(24) హైదరాబాద్‌లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కొంతకాలంగా ‘డఫ్పా బెట్‌’ అనే ఆన్‌లైన్‌ గేమ్‌ అలవాటు పడ్డాడు. ఆటాడితే సొమ్ము వస్తుండడంతో అందులో మునిగిపోయాడు. ఇదేక్రమంలో తన వద్ద ఉన్న డబ్బుతో పాటు మిత్రులు, బంధువులు, తెలిసిన వారి వద్ద సుమారు రూ.15 లక్షల వరకు అప్పులు చేసి గేమ్‌లో పెట్టి కోల్పోయాడు. తీరా చేసిన అప్పులు తీర్చమంటూ ఒత్తిడి పెరిగింది. దీంతో విషయమం తెలిసిన తండ్రి కొడుకు చేసిన అప్పులు మొత్తం తీర్చారు. ఈ క్రమంలో తనవల్ల తల్లిదండ్రులపై తీరని భారం పడిందని మధూకర్‌ మానసిక వేధనకు గురయ్యాడు.

అయితే, ఈ నెల 7న ఉదయం ఏటీఎం నుంచి డబ్బులు తేవాలని తండ్రి చెప్పడంతో, ఇంట్లో నుంచి బయల్దేరాడు మధూకర్. మంగళవారం మధ్యాహ్నం సమయంలో దండేపల్లి మండలం చింతపల్లి గ్రామంలో ఉండే ఆయన సోదరి మౌనికకు తాను మంచిర్యాలలో పురుగుల మందు తాగినట్లు మొబైల్ ద్వారా మేసేజ్ చేశాడు. వెంటనే ఆమె తండ్రికి సమాచారం ఇవ్వడంతో మంచిర్యాలకు చేరేసరికే పురుగుల మందు తాగి అపస్మరకస్థితి చేరాడు మధూకర్. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అతడిని కరీంనగర్‌ తరలించి చికిత్స అందిస్తుండగా, శనివారం యువకుడు మృతి చెందాడు. తండ్రి శంకర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.