విమాన ప్రయాణాల్లో తోటి ప్రయాణికుల పట్ల దారుణాలు ఇటీవల కాలంలో శృతి మించుతున్నాయి. ఓ అంతర్జాతీయ విమానంలో జరిగిన జుగుత్సకర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్ నుంచి బెంగళూరు వస్తున్న అంతర్జాతీయ విమానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ (32)కు అలాంటి వేధింపులే ఎదురయ్యాయి. తిరుపతికి చెందిన 32 ఏండ్ల మహిళపై ఆమె పక్క సీట్లో కూర్చొన్న తోటి ప్రయాణికుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. నవంబర్ 6న లుఫ్తాన్సా విమానంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బెంగళూరు ఎయిర్‌పోర్టు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకని కేసు నమోదు చేశారు.
అంతర్జాతీయ విమానంలో ప్రయాణిస్తున్న మహిళ నిద్రపోతుండగా ఆమె పక్కనే కూర్చున్న 52 ఏళ్ళ తోటి ప్రయాణికుడు వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. మహిళ ప్రైవేటు భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాదు ప్రయాణ సమయంలోనే మాటలతో, శారీరకంగా లైంగిక వేధింపులు కొనసాగించాడు. దీంతో సహనం కోల్పోయిన మహిళ, ఇదే విషయాన్ని ఎయిర్‌లైన్స్ సిబ్బందికి చెప్పి, తన సీటును మరోచోటికి మార్చుంచుకుంది.
ఈ క్రమంలోనే విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో సదరు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఐపీసీ సెక్షన్ 354 ఎ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచగా, అతడు బెయిల్‌పై విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…