
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విమానాశ్రయం అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థ నుంచి బుధవారంనాడు బెదరింపు కాల్స్ వచ్చాయి. గురువారంనాడు రెండు ఎయిర్ ఇండియా విమానాలను లండన్‌కు వెళ్లకుండా అడ్డుకుంటామని ఖలిస్థాన్ కమెండో ఫోర్స్ అనే ఉగ్ర సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఖలిస్థాన్ కమెండో ఫోర్స్‌తో సంబంధాలున్న ఉగ్రవాది గురుపట్వంత్ సింగ్ పన్ను నుంచి పలువురుకి ఈ బెందరింపు కాల్స్ వచ్చాయని పోలీసులు వెల్లడించారు. రెండు ఎయిర్ ఇండియా విమానాలను లండన్‌లో దిగనీయమని చెప్పాడని ఎయిర్‌పోర్ట్ డీజీపీ రాజీవ్ రంజన్ మీడియాకు తెలిపారు. ఉగ్ర బెదరింపుల నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్ అథారిటీతో పాటు ఎయిర్ ఇండియా, సీఐఎస్ఎఫ్ అప్రమత్తమయ్యాయి. న్యూఢిల్లీలో 1984లో చోటుచేసుకున్న సిక్కుల ఊచకోత ఘటన జరిగిన 36 ఏళ్లు అయిన నేపథ్యంలో ఖలిస్థాన్ గ్రూప్ నుంచి ఈ హెచ్చరికలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.