Father Swim death: క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కూతురి ప్రాణాలకు తన ప్రాణాలను పణంగా పెట్టాడు ఆ తండ్రి. ఆవేశంలో కాల్వలో దూకిన కుమార్తెను క్షేమంగా ఒడ్డుకు చేర్చి తాను తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయాడు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం హంసవరంలో ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది.
ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. హంసవరం గ్రామానికి రావాడ నిర్మల స్థానిక మోడల్ స్కూలులో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. తండ్రి జయబాబు, తల్లి అప్పలకొండ ఉపాధి పనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చారు. విమల కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండడంతో తల్లిదండ్రులు ఆగ్రహం తెప్పించింది. దీంతో కాలేజీకి ఎందుకు వెళ్లలేదని కూతరును మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. తాను చనిపోతానంటూ పరిగెడుతూ వెళ్లి సమీపంలో ఉన్న పోలవరం కాల్వలో దూకింది.
ఆమె వెనకే వెళ్లిన తండ్రి జయబాబు కూతురును రక్షించేందుకు ప్రయత్నించాడు. కాల్వలో దూకిన జయబాబు.. కుమార్తెను పట్టుకుని ఈదుకుంటూ జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చాడు. అప్పటికే అలసిపోయిన అతను ఉన్నట్టుండి కాల్వలోకి జారిపోయాడు. అక్కడకు చేరుకున్న స్థానికులు విమలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తండ్రి మాత్రం కనిపించకుండా పోయాడు. గ్రామస్తులు వెతికిన ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి కాల్వలో వెతగ్గా జయబాబు శవమై తేలాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న తుని రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.