Cheating Scheme: పప్పుల చీటీ స్కీమ్ అంట.. ఎగబడి మరి కట్టారు.. చివరకు..
విజయనగరం జిల్లాలో పప్పుల చిట్టీ పేరుతో కొత్త రకం ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ మొత్తంలో నెలవారి వాయిదాలు చెల్లిస్తే అంతకన్నా ఎక్కువ లాభం వచ్చేలా, ఒకేసారి నాణ్యమైన సరుకులు ఇస్తామని నమ్మబలికింది. కష్టమర్ల నుండి కోట్ల రూపాయలు దండుకోని ఉడాయించిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. తమకు జరిగిన అన్యాయం తెలుసుకుని వందలాది మంది బాధితులు లబోదిబోమంటున్నారు.
విజయనగరం జిల్లాలో పప్పుల చిట్టీ పేరుతో కొత్త రకం ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ మొత్తంలో నెలవారి వాయిదాలు చెల్లిస్తే అంతకన్నా ఎక్కువ లాభం వచ్చేలా, ఒకేసారి నాణ్యమైన సరుకులు ఇస్తామని నమ్మబలికింది. కష్టమర్ల నుండి కోట్ల రూపాయలు దండుకోని ఉడాయించిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. తమకు జరిగిన అన్యాయం తెలుసుకుని వందలాది మంది బాధితులు లబోదిబోమంటున్నారు.
జిల్లాలో తరచూ చిట్టీల పేరుతో మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలోని జామి మండలంలో మరో చిట్టీల మోసం వెలుగులోకి వచ్చింది. జామి బిసి కాలనీలో నివాసం ఉంటున్న అల్లాడ సీత అనే మహిళ ఓ జాతీయ బ్యాంకులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తోంది. బ్యాంకులో ఉద్యోగం కావడంతో స్థానికంగా పరపతి పెరిగింది. అంతే స్థాయిలో పరిచయాలు కూడా పెరిగాయి. ఇదే ఆసరా చేసుకుని ఆమె తనకు స్థానికంగా పరిచయం ఉన్న వారిని కలిసి పప్పుల చీటీ వేస్తున్నానని నమ్మబలికింది. తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించింది. బ్యాంక్ ఉద్యోగి కావడంతో ఎవరికి అంతలా అనుమానం రాలేదు. స్థానికులు ఆమెకు చిట్టీలు కట్టేందుకు ముందుకు వచ్చారు. అలా ఒక్కొక్కరుగా వచ్చిన కస్టమర్స్ పెరిగి ఆరు వందల మంది వరకు అయ్యారు.
అసలు పప్పుల చీటీ అంటే ఏమిటి?
ఒక్కో సభ్యులు నెలకు 350 రూపాయలు చొప్పున 12 నెలల పాటు కడితే జనవరి నెలలో సంక్రాంతి పండుగకు కస్టమర్స్ కట్టిన డబ్బు కన్నా ఎక్కువ విలువ చేసే ఇరవై రకాల నిత్యవసర సరుకులు ఇస్తారు. అలా ఇచ్చే సరుకుల్లో బియ్యం, నూనె, కందిపప్పు, మినపప్పు,పంచదార తో పాటు వంటలకు ఉపయోగించుకునే మొత్తం ఇరవై రకాలు ఇస్తారు. ఇదే స్కీమ్ నిర్వాహకురాలు అల్లాడ సీత స్థానికంగా ప్రారంభించింది. ఆమెను నమ్మిన 600 మందికి పైగా కస్టమర్లు 12 నెలలపాటు ఒక్కొక్కరు సుమారు రూ. 4,500 వరకు చెల్లించారు. తరువాత అనుకున్నట్లు వాయిదాలు పూర్తవ్వడంతో జనవరి నెలలో సంక్రాంతి పండుగకు సరుకులు ఇవ్వాలని నిర్వాహకురాలిని అడిగారు కస్టమర్స్.
కొద్దిరోజులు కల్లబొల్లి కబుర్లు చెప్పి తప్పుంచుకుని తిరగింది సీత.. ఇక తీరా నిలదీసే సరికి, కలెక్ట్ చేసిన డబ్బు అంతా సరుకులు నిమిత్తం వేరొకరికి ఇచ్చానని, అతను తనను మోసం చేశాడని ఖాతాదారులకు చెప్పి చేతులెత్తేసింది. దీంతో విషయం తెలుసుకుని తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న నిర్వాహకురాలు సీత ఊరు వదిలి పరారయ్యింది.
ఈ పప్పుల చిట్టీల బాధితులు జామి మండలంతో పాటు పరిసర ప్రాంత గ్రామాల్లో సైతం వందల్లో ఉన్నట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. అంతా పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన వారే కావడం విశేషం. ఒకేసారి వేల రూపాయల సరుకులు కొనలేక నెలనెలా రూ. 350 చొప్పున తమకు వచ్చే కూలీ డబ్బులతో నెలవారీ వాయిదాలు కట్టారు బాధితులు. ఇప్పుడు విషయం తెలుసుకుని గగ్గోలు పెడుతున్నారు. తమకు న్యాయం చేయాలని ఆందోళనలు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…