స్నేహాం పేరుతో దగ్గరయ్యాడు.. ప్రేమించానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుందామంటూ ఇద్దరు ఇల్లు విడిచి పారిపోయారు.. ఆ తర్వాత అవసరం లేదంటూ గెంటేశాడు. ప్రియురాలిని పక్కన పెట్టేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో మోసపోయానని తెలిసిన ప్రియురాలు న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మరో వివాహానికి సిద్ధమైన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు పట్టణానికి చెందిన యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఏడాదిన్నర క్రితం ఊరు విడిచి హైదరాబాద్‌లో సహజీవనం చేశారు. గత మూడు నెలల క్రితం నుండి స్వగ్రామం నాగర్ కర్నూలుకు వచ్చి జీవిస్తున్నారు. ఇక్కడ వీరి ప్రేమకథ మరో మలుపు తిరిగింది.
స్వగ్రామంలో నివసిస్తున్న ప్రేమికులను వారి కుటుంబీకులు కలిశారు. మరో అమ్మాయితో ఆ యువకుడికి మళ్లీ పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు కుటుంబీకులను నిలదీసింది. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. చివరకు ప్రియుడి ఇంటి ముందు టెంట్ వేసి ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అంటోంది.