Tiger Skin: అన్నీ అనుమానాలే.. అసలు పులి చర్మం ఎక్కడ..? అటవీశాఖ దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

|

Dec 15, 2021 | 2:05 PM

ఆదిలాబాద్ జిల్లాలో పట్టుబడ్డ పులి చర్మం కథ పలు మలుపులు తిరుగుతోంది. బేల మండలం మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో అటవిశాఖ , పోలీస్ శాఖ చేపట్టిన డెకాయిట్ ఆపరేషన్ లో పట్డుబడ్డ పులి చర్మం నకిలీదని అసలు చర్మం మిస్ అయిందన్న అనుమానాలు తెరమీదకొస్తున్నాయి.

Tiger Skin: అన్నీ అనుమానాలే.. అసలు పులి చర్మం ఎక్కడ..? అటవీశాఖ దర్యాప్తులో షాకింగ్ విషయాలు!
Tiger Skin
Follow us on

Adilabad Tiger Skin: ఆదిలాబాద్ జిల్లాలో పట్టుబడ్డ పులి చర్మం కథ పలు మలుపులు తిరుగుతోంది. బేల మండలం మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో అటవిశాఖ , పోలీస్ శాఖ చేపట్టిన డెకాయిట్ ఆపరేషన్ లో పట్డుబడ్డ పులి చర్మం నకిలీదని అసలు చర్మం మిస్ అయిందన్న అనుమానాలు తెరమీదకొస్తున్నాయి. ఈ నకిలీ పులి చర్మంకి సరిగ్గా 45 రోజుల క్రితం కొమురంభీం జిల్లాలో పట్టుబడ్డ పులి చర్మానికి లింక్ ఉన్నట్టుగా పలు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అక్టోబర్ 31 న కొమురం ఆసిపాబాద్ జిల్లాలో పట్టుబడ్డ పులి చర్మం కేసులో అరెస్ట్ అయిన నిందితులు.. ఇంద్రవెళ్లి మండలం వాల్గొండ , వడిగూడకు చెందిన వారు కాగా.. ఆ ప్రాంతం నుండి వచ్చిన ఓ నమ్మదగిన సమాచారంతో పోలీస్, అటవీ శాఖ జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్టు సమాచారం. అయితే, డెకాయిట్ ఆపరేషన్ తరువాత అటవీశాఖ చేపట్టిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డట్టుగా తెలుస్తోంది. నిందితులు పులిని చంపింది వాస్తవమని.. తమ పశువులపై దాడులు చేస్తున్న క్రూరమృగాలను ఖతం చేయడానికి ఉచ్చులు పెట్టామని నిందుతులు అటవీశాఖ దర్యాప్తులో ఒప్పుకున్నట్టు సమాచారం.

ఇంతకీ అసలు పులి చర్మం ఎక్కడా..?
పట్టుబడిన చర్మం పులి చర్మమే కాదంటూ అటవీ శాఖ ఓ ప్రకటన విడుదల చేయడం తాజాగా పలు అనుమానాలకు తావిస్తోంది.. లేదు లేదు మేం పులిని చంపాం.. కావాలంటే సాక్ష్యం ఇదిగో అంటూ అటవీశాఖ అదుపులో ఉన్న ముగ్గురు నిందితుల్లో ఇద్దరు బలంగా చెప్పినట్టుగా తేలడంతో ఇంతకీ అసలు పులి చర్మం ఎక్కడా అన్న అనుమానాలు తెర మీదికొస్తున్నాయి‌. అటవీశాఖ నిందితులుగా భావిస్తున్న నార్మూర్ మండలం గాదిగూడ కు చెందిన ఓ వ్యక్తి, బేల మండలానికి చెందిన బాదీ గ్రామానికి చెందిన మరో వ్యక్తి చెపుతున్నదే నిజమైతే అసలు పులి చర్మం ఎక్కడ. ఇదే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా అటవీశాఖను కలవర పెడుతోంది.

డెకాయిట్ ఆపరేషన్ సక్సెస్.. కానీ!
మహారాష్ట్ర ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతం బేల, లోకారీ మండలాల పరిదిలో పులి చర్మం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా వచ్చిన నమ్మదగిన సమాచారంతో జాయింట్ డేకాయిట్ ఆపరేషన్ షురూ చేసిన పోలీస్ శాఖ, అటవీశాఖ.. ఏకంగా 15 లక్షల డీల్‌తో గాదిగూడకు చెందిన ఓ వ్యక్తి వద్ద ఉన్న పులి చర్మాన్ని కొనుగోలు చేసేందుకు వెళ్లారు. ఈ ఆపరేషన్ లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని పులి చర్మాన్ని సీజ్ చేశారు. సీన్ కట్ చేస్తే పోలీస్, అటవీశాఖ జాయింట్ ఆపరేషన్ లో పట్టుబడిన చర్మం పులిది కాదని తేలింది. పులి చర్మంగా నమ్మించి బురిడి కొట్టే ప్రయత్నం చేసినట్టు తేలింది. దీంతో అవాక్కయిన అటవీశాఖ నకిలీ పులి చర్మం కేసును సీరియస్‌గా తీసుకుంది. నిందితులు ఇచ్చిన సమాచారంతో నార్నూర్ , బేల, లోకారి , ఉమ్రి, ఇంద్రవెళ్లి, సిర్పూర్ (యు)లోని ఆరు ప్రాంతాల్లో జల్లెడ పట్టిన అటవీశాఖకు షాకింగ్ విషయాలు తెలిసినట్టు సమాచారం. ఉచ్చులతో క్రూరమృగాలను హతం చేస్తున్న ముఠాలతో పాటు నకిలీ చర్మాలను.. పులి చర్మాలుగా నమ్మించి విక్రయిస్తున్న ముఠాలు సంచరిస్తున్నట్టుగా తేలింది. దీంతో అలర్ట్ అయిన అటవీశాఖ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం. అయితే డెకాయిట్ ఆపరేషన్ లో పట్డుబడ్డ నకిలీ పులి చర్మం కేసులో అటవీశాఖ అదుపులో ఉన్న నిందితులు చెప్పిన వివరాల ప్రకారం అసలు పులి చర్మం ఎక్కడా అన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్. నకిలీ పులి చర్మంగా భావిస్తున్న చర్మం ఏ జంతువుదో కూడా తేలాల్సి ఉంది.

Read Also…  Tirupati: భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం.. పుల‌కించిన స‌ప్తగిరులు.. వ‌ర్షాన్ని సైతం లెక్క చేయ‌ని భ‌క్తులు