Cyber Crime: రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా నేరాల స్వభావం కూడా మారుతోంది. ప్రపంచంలో ఎక్కడో కూర్చొని బాధితుల ఖాతాల్లోని డబ్బును కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. ఇక టెక్నాలజీపై అవగాహన ఉన్న దేశాల్లోనే ఎక్కువగా ఈ సైబర్ నేరాలు జరుగుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ప్రపంచంలో ఏ దేశాల్లో అధికంగా సైబర్ నేరాలు జరుగుతున్నాయన్న దానిపై ఓ నివేదికను విడుదల చేసింది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలోనే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతోన్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా భారత్ 4వ స్థానంలో ఉంది. ఇంటర్నెట్ క్రైమ్ కంప్లయింట్ సెంటర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎఫ్‌బీఐ ఈ జాబితాను రూపొందించింది.
అంటే సైబర్ నేరాలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ జాబితాను విడుదల చేశారు. 2021లో 3131 మంది సైబర్ నేరాల బారిన పడిన బాధితులతో 4వ స్థానంలో నిలిచింది. ఇక 4,66,501 మందితో అమెరికా మొదటి స్థానంలో, 3,03,949 మందితో యూకే రెండో స్థానంలో, 5788 మందితో కెనడా మూడో స్థానంలో నిలిచింది. 5వ స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. అత్యధికంగా సైబర్ నేరాలు నమోదవుతున్న 20 దేశాల జాబితాను ఎఫ్‌బీఐ విడుదల చేసింది.
ఇక మన పొరుగు దేశాలైనా పాకిస్థాన్, చైనాలు సైబర్ క్రైమ్ బాధితుల్లో మనకంటే తక్కువే నమోదయ్యాయి. మిగిలిన అన్ని దేశాల్లో బాధితుల సంఖ్య 25 వేలు మాత్రమే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న సైబర్ క్రైమ్స్‌లో ఎక్కువగా ఫిషింగ్ తరహా మోసాలు జరుగుతున్నట్లు ఈ నివేదికలో వెల్లడైంది. రకరాల స్పామ్ మెసేజ్‌లు, మెయిల్స్‌తో కంప్యూటర్‌లను తమ ఆధీనంలోకి తీసుకొని యూజర్ల వ్యక్తిగత డేటాను దొంగలిస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..