రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. తల్లి మరణాన్ని తట్టుకోలేక ఓ యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోవడానికి ముందు అతడు ఓ సెల్ఫీ వీడియో తీసుకుని తన స్నేహితులకు షేర్ చేశాడు. అమ్మ దూరం అయ్యాక తాను పడుతున్న భాదనంతా ఆ వీడియోలో చెప్పుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియో ఇప్పుడు నెటిజన్లు సైతం కన్నీళ్లు పెట్టిస్తోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామానికి చెందిన రాకేష్ అనే యువకుడు సెల్ఫీ సూసైడ్ చేసుకున్నాడు. స్థానికంగా నివసిస్తున్న రాకేష్ తల్లి ఏడాది క్రితం క్యాన్సర్ వ్యాధితో మృతిచెందింది. కాగా, రాకేష్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఉన్న ఊరికి దూరంగా ఉన్నప్పటికీ అమ్మ మరణం తట్టుకోలేక పోయాడు.. పదే పదే అమ్మ జ్ఙాపకాలతో గడుపుతూ ఉండేవాడు. ఊరికి దూరంగా ఉండలేక తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే తన స్నేహితులను కలిసి తన తల్లి లేని లోటు గురించి గుర్తు చేసుకుంటూ మనో వేదనకు గురయ్యాడు. ఊరి శివార్లలోని బిక్కవాగు వద్ద తన తల్లిని దహనం చేసిన చోటుకి వెళ్లాడు. అక్కడే సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్థులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించే లోపే రాకేష్ చనిపోయాడు.
ఆత్మహత్యకు ముందు రాకేష్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. దానిని స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపాడు. వీడియోలో…‘‘అమ్మా కలలోకి వస్తున్నావ్…నీ దగ్గరకే వస్తున్నా’ ..మిస్ యూ రమ్య, డాడీని బాగా చూసుకో. నాన్న నువ్వు కూడా తాగుడు పెట్టకు. రమ్యను బాగా చూసుకో.. మంచిగా పెళ్లి చెయ్. నేను చనిపోయాక ఏడ్వకండి. ఉంటా’’ అని రాకేష్ సెల్ఫీ వీడియోలో అన్నాడు. ‘ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తనను క్షమించాలని కుటుంబ సభ్యులను కోరాడు.