
Car falls into well in Madhya Pradeshs Chhatarpur: అతివేగం ఆరుగురిని జలసమాధి చేసింది. బావిలోకి వాహనం దూసుకెళ్లడంతో అందులో ఉన్న ఆరుమంది అక్కడికక్కడే మరణించారు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఒక బొలేరో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. అందులో మొత్తం 9 మంది ఉన్నారు. ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడ చనిపోయారు. వారంతా జల సమాధి అయ్యారు. మరో ముగ్గురిని స్థానికులు కాపాడారు. కానీ వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. క్రేన్ సాయంతో కారును బావిలో నుంచి బయటకు తీశారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినందని పోలీసులు తెలిపారు.