Drug Trafficking: ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా డ్రగ్స్ అక్రమ రవాణా ఆగడం లేదు. రోజుకో మార్గంలో నేరస్థులు ఇతర దేశాల నుంచి అక్రమంగా రూ.కోట్ల డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. తాజాగా తమిళనాడులో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. చెన్నై-గుమిడిపూడి జాతీయ రహదారిపై వాహనాన్ని తనిఖీ చేయగా రూ. కోట్ల డ్రగ్స్ (Drugs Seized) బయటపడింది. ఈ తనిఖీల్లో 11 కిలోల యాంపిటమైన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాహన డ్రైవర్‌తోపాటు మరో ఐదుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో ముగ్గురు శ్రీలంక (Sri Lanka) కు చెందినవారు కాగా మరో ముగ్గురు తమిళనాడు, మణిపూర్ వాసులుగా ఎన్‌సీబీ (NCB) అధికారులు గుర్తించారు.
మాదక ద్రవ్యాలను సముద్రం మీదుగా శ్రీలంక తరలించేందుకు నిందితులు కుట్ర పన్నినట్లు అధికారులు పేర్కొంటున్నారు. శ్రీలంక, తమిళనాడు, మణిపూర్‌లో నిందితులు మాదకద్రవ్యాల దందా నిర్వహిస్తున్నట్లు ఎన్‌సీబీ చెన్నై జోన్ జోనల్ డైరెక్టర్ అమిత్ ఘావటే పేర్కొన్నారు. అంతేకాకుండా శ్రీలంకకు హెరాయిన్, యాంపిటమైన్ ను ఈ ముఠా సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విచారణలో మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశముందని అమిత్ ఘావాటే పేర్కొన్నారు.
Also Read: