Ivermectin: ఐవర్‌మెక్టిన్‌‌ వాడకం వారితో పోల్చితే మరణాలు తక్కువే.. అయినా వినియోగం వద్దు: డబ్ల్యూహెచ్‌వో!

|

May 13, 2021 | 10:50 AM

సాధారణ వైద్యం పొందిన కరోనా బాధితుల కంటే.. ‘ఐవర్‌మెక్టిన్‌’ తీసుకున్నవారిలో మరణాలు తక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. దీనివల్ల తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయని హెచ్చరించింది.

Ivermectin: ఐవర్‌మెక్టిన్‌‌ వాడకం వారితో పోల్చితే మరణాలు తక్కువే.. అయినా వినియోగం వద్దు: డబ్ల్యూహెచ్‌వో!
Ivermectin In Covid 19 Treatment
Follow us on

Ivermectin in COVID-19 treatment: సాధారణ వైద్యం పొందిన కరోనా బాధితుల కంటే.. ‘ఐవర్‌మెక్టిన్‌’ తీసుకున్నవారిలో మరణాలు తక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన ‘థెరపెటిక్‌, కొవిడ్‌-19 లివింగ్‌ గైడ్‌లైన్స్‌’లో ఈ విషయాన్ని పేర్కొంది. సాధారణ వైద్యం పొందినవారు, ఐవర్‌మెక్టిన్‌ టాబ్లెట్స్ తీసుకున్న వారిపై నిర్వహించిన పరీక్షల్లో కనిపించిన తేడాలను నివేదికలో పొందుపరిచింది.

రెండు రోజుల క్రితం కరోనా మహమ్మారి నివారణ చికిత్సగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఐవర్‌మెక్టిన్‌ను అందించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే, ఎక్కడా ఐవర్‌మెక్టిన్‌ ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని మాత్రం డబ్ల్యూహెచ్‌వో పేర్కొనలేదు. పైగా, దీనివల్ల తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయని హెచ్చరించింది. ఐవర్‌మెక్టిన్‌ చికిత్స పొందినవారిలో 56% తక్కువగా మరణాలు ఉన్నప్పటికీ… డబ్ల్యూహెచ్‌వో మాత్రం మరణాలపై దీని ప్రభావం అనిశ్చితిగానే ఉన్నట్లు పేర్కొంది. మెకానికల్‌ వెంటిలేషన్‌ అవసరమయ్యేవారి సంఖ్య కూడా అస్పష్టమేనని తెలిపింది.

ఆసుపత్రుల్లో, ఇళ్లల్లో చికిత్స పొందుతున్న మొత్తం 2,407 మంది కోవిడ్‌ బాధితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తరఫున ఓ అధ్యయనం నిర్వహించింది. దీని ప్రకారం- మెకానికల్‌ వెంటిలేషన్‌, ఆసుపత్రుల్లో చేరిక, అక్కడ ఉండాల్సిన సమయం, వైరస్‌పై పైచేయి సాధించడానికి పట్టే సమయం, మరణాలు వంటి అంశాలన్నింటిలో ఫలితాలు, ఆధారాలు అస్పష్టంగా ఉన్నాయని పేర్కొంది. అందువల్లే ఐవర్‌మెక్టిన్‌ను క్లినికల్‌ ట్రయల్‌ కోణంలో తప్ప మిగతా సందర్భాల్లో ఉపయోగించడానికి సిఫార్సు చేయడంలేదని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.

కోవిడ్ రోగులకు చికిత్స చేయడానికి ఐవర్‌మెక్టిన్ వాడకంపై ప్రస్తుత ఆధారాలు అసంపూర్తిగా ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. “మరింత డేటా లభించే వరకు, క్లినికల్ ట్రయల్స్‌లో మాత్రమే ఈ ఔషధాన్ని ఉపయోగించాలని సిఫారసు చేస్తుంది” అని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ట్వీట్ చేశారు.



Read Also…  పగబట్టిన కరోనా..! థర్డ్ వేవ్ మరింత డేంజర్స్ మరి ముఖ్యంగా పిల్లలపై ..?తస్మాత్ జాగ్రత్త :covid19 in india video