WHO హెచ్చరికః లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తే తీవ్ర పరిణామాలు

|

May 02, 2020 | 11:41 AM

భార‌త్ సహా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న దేశాలు లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

WHO హెచ్చరికః లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తే తీవ్ర పరిణామాలు
Follow us on

భార‌త్ సహా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న దేశాలు లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించవద్దని సూచించింది. కోవిడ్‌ కట్టడికి పలు దేశాలు తీసుకుంటున్న చర్యలు  బాగున్నాయని పేర్కొంంది. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడం వల్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటి వరకూ లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చిన  దేశాల్లో కేసులు ఒక్కసారిగా పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

 

ఇదిలా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటి వరకూ మొత్తం 34 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. వీరిలో దాదాపు 2.40 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, సుమారు 11 లక్షల మంది కోలుకోవడం ఊరట కలిగించే అంశం. మరో 20 లక్షల మందిలో వైరస్ లక్షణాలు ఉన్నాయి. వీరిలో 51 వేల మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇక, అమెరికాలో 24 గంటల వ్యవధిలో 2,053 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మొత్తం మృతుల సంఖ్య 65 వేలు దాటింది. మరోవైపు, అమెరికా వ్యాప్తంగా వైరస్‌ బాధితుల సంఖ్య 11.31 లక్షలకు చేరింది.

 

ఇక, భార‌త్‌లోనూ వైర‌స్ వ్యాప్తి త‌గ్గ‌టం లేదు. దేశ వ్యాప్త లాక్‌డౌన్ కూడా దేశంలో కరోనా విజృంభణను కట్టడి చేయలేకపోతోంది. ఇండియా వ్యాప్తంగా ఈ ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37, 367కు చేరుకుంది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పది వేలు దాటేసింది. గుజరాత్ లోనూ కరోనా విజృంభణ ఉధృతి తీవ్రంగా ఉంది. ఢిల్లీలో కూడా కరోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది.