కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అధికారికంగా ఉపసంహరించుకునే ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది. అయితే పూర్తి ఉపసంహరణకు మరో ఏడాది (2021 జులై) పడుతుంది. కరోనా వైరస్ పై ఈ సంస్థ తప్పుడు సమాచారం ఇచ్చిందని, చైనాకు వత్తాసు పలుకుతోందని అధ్యక్షుడు ట్రంప్ ఆరోపిస్తూ వచ్చారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సమాచారాన్ని ప్రపంచ దేశాలతో షేర్ చేసుకోవడంలో ఈ సంస్థ విఫలమైందని దుయ్యబట్టిన ఆయన.. ఈ సంస్థకుతమ దేశం నుంచి నిధులను స్తంభింప జేసిన విషయం తెలిఅయ్యిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి తమ దేశం వైదొలగుతున్నట్టు నోటిఫికేషన్ అందిందని, అయితే ట్రంప్ ప్రభుత్వ చర్య అమెరికన్లకు ఏ మాత్రం ప్రయోజనకరం కాదని సెనెటర్ బాబ్ మెనెండెజ్ విమర్శించారు. దీనివల్ల అమెరికా ఏకాకి అయిపోతుందన్నారు. ఇక నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తను గెలిచి అధ్యక్షుడినైతే ప్రపంచ ఆరోగ్య సంస్థలో తమ దేశం మళ్ళీ చేరేలా చూస్తానని డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ పేర్కొన్నారు. ట్రంప్ చర్యను ఆయన తప్పు పట్టారు.
కాగా- అమెరికాలో మంగళవారం 46,329 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో సుమారు మూడు లక్షల మంది ఈ ఇన్ఫెక్షన్ కి గురయ్యారు. లక్షా ముఫై వేలకు పైగా రోగులు మరణించారు.